గ్రేటర్ హైదరాబాద్‌లో ఒకే రోజు 17 అక్రమ కట్టడాల కూల్చివేత

17 illegal structures demolished in Greater Hyderabad in a single day
  • అంజయ్యనగర్ ఘటనతో మేల్కొన్న ప్రభుత్వం
  • అక్రమ నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
  • భవన ప్రమాదం కేసులో కాంట్రాక్టర్ మహ్మద్ ఖాజామియా అరెస్ట్
  • అనుమతులు లేని నిర్మాణాలను నోటీసులు లేకుండా కూల్చేయాలని నిర్ణయం
హైదరాబాద్‌లోని అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన.. నగరం ఎదుర్కొంటున్న పెను ప్రమాదాన్ని కళ్లకు కట్టింది. ఒకప్పుడు అటవీ ప్రాంతంగా ఉన్న ఈ ప్రదేశం, ఐటీ అభివృద్ధి పుణ్యమా అని రియల్ ఎస్టేట్ కేంద్రంగా మారి, ఇప్పుడు అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. 50-60 గజాల చిన్న స్థలాల్లో సైతం కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఏడంతస్తుల దాకా భవనాలు నిర్మించడమే తాజా దుర్ఘటనకు కారణమని స్పష్టమవుతోంది.

ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్ష సమావేశంలో అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పౌరుల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులు రంగంలోకి దిగారు.

మంగళవారం ఒక్కరోజే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 17 అనధికార కట్టడాలను కూల్చివేశారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలో ఈ కూల్చివేతలు జరిగాయి. ఇప్పటివరకు మూడు జోన్లలో 54 అక్రమ నిర్మాణాలను గుర్తించగా, నిర్మాణ దశలో ఉన్నవాటిని నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు.

ఇదిలా ఉండగా, అంజయ్యనగర్ భవన ప్రమాద ఘటనలో ప్రధాన నిందితుడైన కాంట్రాక్టర్ మహ్మద్ ఖాజామియాను పోలీసులు అరెస్ట్ చేశారు. నాసిరకం సామగ్రితో నిర్మాణం చేపట్టడంతో పాటు, ప్రమాదాన్ని ముందే పసిగట్టినా అధికారులకు సమాచారం ఇవ్వకుండా పరారైనట్లు దర్యాప్తులో తేలింది. గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీ వంటి ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహా అక్రమ నిర్మాణాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Revanth Reddy
Hyderabad illegal constructions demolition
GHMC crackdown
Anjaiah Nagar building collapse
Serilingampally unauthorized structures
Cyberabad real estate safety

More Telugu News