కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసు: జూబ్లీహిల్స్ సీఐపై వేటు

Konda Surekha former OSD case Jubilee Hills CI suspended for negligence
  • మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో జూబ్లీహిల్స్ సీఐ సస్పెండ్
  • ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం, నిందితుడిని పట్టుకోవడంలో విఫలమవడమే కారణం
  • రియల్టర్‌పై హత్యాయత్నం కేసులో సుమంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు
  • మంత్రి కుమార్తె వ్యాఖ్యల వివాదం కొనసాగుతుండగానే ఈ పరిణామం చోటుచేసుకుంది
రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) ఎన్. సుమంత్‌కు సంబంధించిన కేసులో జూబ్లీహిల్స్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌పై వేటు పడింది. కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్‌ఓ) ముత్తు యాదవ్‌ను సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసును పోలీసులు చేపట్టిన చేసిన తీరుపై విచారణకు కూడా ఆదేశించారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుమంత్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. ఈ కేసులో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు చేయడంలో జాప్యం జరిగిందని, నిందితుడిని పట్టుకోవడంలో సీఐ విఫలమయ్యారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కేసు నేపథ్యం ఏమిటి?

బోడుప్పల్‌కు చెందిన రియల్టర్ గొంగిడి హరికృష్ణ ఫిర్యాదు మేరకు సుమంత్‌తో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసి, రూ.10 కోట్లు డిమాండ్ చేశారని హరికృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జులై 30న రాము కార్యాలయంలో కలవాలని సుమంత్ కోరగా, అక్కడికి వెళ్లిన తనను దుర్భాషలాడుతూ ఇనుప రాడ్‌తో దాడి చేశాడని తెలిపారు. సుమంత్ ఆదేశాలతో మిగిలిన వారు కూడా దాడిలో పాలుపంచుకున్నారని వివరించారు. ఈ దాడిలో తన ఎడమ చేతికి ఫ్రాక్చర్ అయిందని, తీవ్ర రక్తస్రావంతో పాటు ఇతర గాయాలయ్యాయని, ఆగస్టు 10న శస్త్రచికిత్స చేయించుకున్నానని బాధితుడు పేర్కొన్నాడు.

ఈ ఫిర్యాదు ఆధారంగా మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో సుమంత్, రాము, ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డిలపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఈ కేసును విచారణ నిమిత్తం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 109 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ వివాదం నడుస్తున్న తరుణంలోనే, మంత్రి మాజీ ఓఎస్డీపై తీవ్రమైన ఆరోపణలతో కేసు నమోదు కావడం, ఇప్పుడు ఆ కేసులో పోలీసు అధికారిపై వేటు పడటం చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Konda Surekha
N Sumanth OSD Case
Jubilee Hills CI Suspended
Hyderabad Police Commissioner Sajjanar
Realtor Attack Case Hyderabad
Muthu Yadav SHO

More Telugu News