కారుమూరికి గతంలో నేర చరిత్ర లేదు, జగన్ మాయలో పడి స్కామ్‌లో ఇరుక్కుపోయారు: మంత్రి కొలుసు పార్థసారథి

Kolusu Parthasarathy says Karumuri had no criminal history but trapped in Jagan scam
  • మద్యం కుంభకోణానికి తాడేపల్లి ప్యాలెస్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్న పార్థసారథి
  • మద్యపాన నిషేధం హామీ ఇచ్చి, వేల కోట్ల దోపిడీకి పాలసీ మార్చారని ఆరోపణ
  • అవినీతికి బీసీ నేతలను పావులుగా వాడుకుని జగన్ బలిపశువుల్ని చేస్తున్నారని విమర్శలు
  • దర్యాప్తు సంస్థల వద్ద పక్కా ఆధారాలుండటంతోనే కోర్టులు బెయిల్ ఇవ్వడం లేదని స్పష్టీకరణ
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేకపోయినా, కేవలం జగన్ మాయలో పడి దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంలో ఇరుక్కుపోయారని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు. తన దోపిడీకి బలహీన వర్గాల నాయకులను పావులుగా వాడుకుని, పాము తన పిల్లల్నే తిన్నట్లుగా వారిని బలిపశువులను చేయడం జగన్‌కు అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. మద్యం స్కామ్‌కు కేరాఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్ అని, అక్కడి నుంచే వేల కోట్ల రూపాయల దోపిడీకి ప్రణాళికలు రచించారని విమర్శించారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన గత వైసీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఎన్నికల ముందు ఊరూరా మద్యపాన నిషేధం అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక, వేల కోట్ల రూపాయల దోపిడీకి అనువుగా మద్యం పాలసీని మార్చారని పార్థసారథి ఆరోపించారు. మద్యం తయారీ డిస్టిలరీల నుంచి డీలర్ల నియామకం, రవాణా, హోలోగ్రామ్స్ వరకు ప్రతి దశలోనూ వేల కోట్లు కొల్లగొట్టి, ఆ డబ్బును రహస్య స్థావరాల్లో దాచిన తీరు ఆధారాలతో సహా బయటపడిందన్నారు. సుమారు రూ.3,500 కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చినా వైసీపీ నాయకుల్లో పశ్చాత్తాపం లేదని, తమ అవినీతిపై విచారణ జరిపితే ప్రజల దృష్టిని మళ్లించడానికి కులాలు, మతాలు, రాజకీయ కక్షలంటూ ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు.

"తమకు అనుకూలంగా ఉంటే సీబీఐ విచారణ కావాలంటారు, అదే దర్యాప్తు సంస్థలు ఆధారాలతో దోపిడీని బయటపెడితే రాజకీయ కక్ష అని గగ్గోలు పెడతారు. ఇది గొడ్డలి పార్టీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం" అని ఆయన ఎద్దేవా చేశారు.

మద్యం, ఇసుక దోపిడీ కోసమే గత ప్రభుత్వం రాజ్ కెసిరెడ్డి వంటి సలహాదారులను నియమించుకుని, ఇతర ప్రాంతాల అధికారులను డెప్యుటేషన్‌పై తెచ్చి అక్రమాలకు పాల్పడిందని పార్థసారథి ఆరోపించారు. మాజీ మంత్రి కారుమూరి కుటుంబం మద్యం వ్యాపారం, రవాణా కాంట్రాక్టుల్లో ఉందని స్వయంగా అంగీకరించారని గుర్తుచేశారు. ఒక బాక్స్ మద్యం రవాణాకు రూ.13 ఉండాల్సిన ఖర్చును ఏకంగా రూ.35కు పెంచి, సుమారు రూ.400 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు పక్కా ఆధారాలతో తేల్చాయన్నారు. చేసిన పాపాలు బయటకొచ్చినప్పుడు తమను తాము కాపాడుకోవడానికే, గత ప్రభుత్వం బలహీన వర్గాల నాయకులను ఇలాంటి అవినీతి కార్యక్రమాల్లోకి లాగిందని ప్రజలు అనుమానిస్తున్నారని పేర్కొన్నారు.

అవినీతికి పాల్పడింది బలహీన వర్గాల వారైనా, మరెవరైనా చట్టం ముందు అందరూ సమానమేనని మంత్రి స్పష్టం చేశారు. నిజంగా ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుంటే, నిందితులకు సుప్రీంకోర్టు వరకు వెళ్లినా ఎందుకు బెయిల్ లభించడం లేదని ఆయన ప్రశ్నించారు. పక్కా సాక్ష్యాధారాలు ఉండటం వల్లే న్యాయస్థానాలు ఉపశమనం ఇవ్వడం లేదని, ఈ నిజాన్ని జగన్, ఆయన పార్టీ గ్రహించాలన్నారు. దేశ న్యాయవ్యవస్థపై వారికి నమ్మకం ఉందో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మద్యం స్కామ్‌లో దోచుకున్న నల్లధనాన్ని రియల్ ఎస్టేట్, విదేశాల్లో మైనింగ్ వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో ‘బూమ్ బూమ్’, ‘ప్రెసిడెంట్ మెడల్’ వంటి నాసిరకం బ్రాండ్లను అమ్మి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడారని పార్థసారథి ఆరోపించారు. ఆ మద్యం తాగలేక ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్లేవారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకురాని బ్రాండ్ల పేర్లతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ తన ధన దాహం, అధికార వ్యామోహం కోసం బలహీన వర్గాల నాయకులను బలిపశువులుగా మార్చారని, వారి కుటుంబ సభ్యులను, మహిళల బ్యాంకు ఖాతాలను సైతం వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి రాష్ట్ర సంపదను దోచుకున్న ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి పార్థసారథి హెచ్చరించారు.
Advertisement
Kolusu Parthasarathy
Karumuri Nageswara Rao
YS Jagan Mohan Reddy
AP Liquor Scam
Tadepalli Palace
Andhra Pradesh Politics

More Telugu News