ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ.. ప్రపంచ మార్కెట్లే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu aims for global markets through food processing and crop value addition
  • దేశీయ పాప్‌కార్న్ విత్తనాలను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి, సీఎం
  • ఫుడ్ ప్రాసెసింగ్‌తో వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు
  • ఆంధ్రా పాప్‌కార్న్, అరకు కాఫీలను గ్లోబల్ బ్రాండ్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
  • రాయలసీమను ఉద్యాన హబ్‌గా మార్చేందుకు భారీ ప్రణాళిక
  • నదుల అనుసంధానంతో నీటి భద్రత సాధిస్తామన్న చంద్రబాబు
వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా విలువ జోడించి, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రక్రియతో ఉత్పత్తుల విలువ పెరిగి, రైతులకు ప్రయోజనం కలగడమే కాకుండా రాష్ట్రంలో సంపద సృష్టి జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఏలూరు జిల్లా ముసునూరు వద్ద ఏర్పాటు చేసిన ‘గార్మే పాప్ కార్నికా’ నాన్-జీఎంఓ హైబ్రీడ్ మొక్కజొన్న విత్తనాలను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం దేశంలోనే అతిపెద్ద పాప్‌కార్న్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. "రైతులపై ఉన్న ప్రేమతో ఉపరాష్ట్రపతి ఏలూరు జిల్లాకు వచ్చి జన్యుమార్పిడి చేయని మొక్కజొన్న విత్తనాలను ఆవిష్కరించారు. గార్మే పాప్ కార్న్ సంస్థ మన దేశీయ నేలపైనే రైతులతో కలిసి నాన్-జీఎంఓ విత్తనాలను ఉత్పత్తి చేయడం అభినందనీయం. నూజివీడు గడ్డపై పండిన ఈ పాప్‌కార్న్ దేశవిదేశాలకు ఎగుమతి కావడం గర్వకారణం" అని అన్నారు. 

17,500 మంది రైతులతో 40 వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తూ, దేశీయ పాప్‌కార్న్ ఉత్పత్తిలో 70 శాతం వాటాను కలిగి ఉండటంపై గార్మె సంస్థను ఆయన ప్రశంసించారు. ఇప్పటివరకు పాప్‌కార్న్ కోసం బ్రెజిల్ వంటి దేశాలపై ఆధారపడ్డామని, ఇకపై ఆ సంపద మన దేశంలోనే ఉంటుందని తెలిపారు.

గ్లోబల్ బ్రాండ్లుగా మన ఉత్పత్తులు
"ఆంధ్రా పాప్‌కార్న్, అరకు కాఫీ, కోస్తా కోకో వంటివి ప్రపంచ ప్రసిద్ధి చెందిన బ్రాండ్లుగా మారాలి. రైల్వే స్టేషన్లలోనూ వీటి కౌంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. కొండపల్లి కొయ్యబొమ్మల వంటి స్వదేశీ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు చేరాలి. కేంద్ర, రాష్ట్రాల్లోని ఎన్డీఏ ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా, రైతులను పారిశ్రామికవేత్తలుగా చూస్తున్నాయి. పసుపు, మిరప, ఆక్వా ఉత్పత్తులకు విలువ జోడించి ఎగుమతి చేయడమే మా లక్ష్యం" అని చంద్రబాబు వివరించారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 10 శాతం ఉత్పత్తులు మాత్రమే ప్రాసెస్ అవుతున్నాయని, ఈ శాతాన్ని పెంచడం ద్వారా అధిక సంపదను ఆర్జించవచ్చని అన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని, ముఖ్యంగా యువత ఈ రంగంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి జల భద్రతే కీలకం
రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల గురించి వివరిస్తూ.. "రాయలసీమను ఉద్యాన పంటల హబ్‌గా మార్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో సీమను అభివృద్ధి చేస్తాం. రూ.35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం" అని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

ఈ నెలాఖరులో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు నీరందిస్తామన్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించి పంటలను కాపాడామని గుర్తుచేశారు. చింతలపూడి ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత భవిష్యత్తు మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం జరగాలన్నది ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన అని ముఖ్యమంత్రి తెలిపారు. "గోదావరి-కృష్ణా, తుంగభద్ర, పెన్నా-కావేరీ నదుల అనుసంధానంతో 4 రాష్ట్రాల్లో నీటి సమస్యలు తీరతాయి. గంగ, మహానది, గోదావరి నదులను కూడా కలిపితే వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. నీటి భద్రత సాధిస్తే దేశాభివృద్ధి అన్‌స్టాపబుల్" అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కె. అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Food Processing
Gourmet Popcornica
Andhra Pradesh Agriculture
Non GMO Maize Seeds
River Interlinking India

More Telugu News