ఐశ్వర్య లక్ష్మీ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమానే 'అర్చన 31 నాటౌట్'.కామెడీ డ్రామా జోనర్లో నిర్మితమైన సినిమా ఇది. మార్టిన్ ప్రకట్ నిర్మించిన ఈ సినిమాకి, అఖిల్ అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో రూపొందిన ఈ సినిమా, 2022లోనే థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా రీసెంటుగా 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

అర్చన (ఐశ్వర్య లక్ష్మి) ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన యువతి. ఆమె ఒక స్కూల్ లో టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. కుటుంబ బరువు బాధ్యతలను ఆమెనే నిర్వహిస్తూ ఉంటుంది. స్కూల్ లో ఆమె పరిస్థితి కష్టంగా ఉంటుంది. ఆ స్కూల్ లో టీచర్లను తొలగించే ప్రక్రియ ఒకటి ప్రారంభమవుతుంది. ఆ జాబితాలో ఆమె పేరు ఉంటుంది. దాంతో జాబ్ పోతే తన పరిస్థితి ఏమిటనే ఒక ఆందోళన ఆమెకి నిద్రలేకుండా చేస్తుంటుంది.

అదే సమయంలో ఆమెకి వరుసగా పెళ్లి సంబంధాలు వస్తుంటాయి. అయితే అనేక కారణాల వలన ఆ సంబంధాలు తప్పిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులలో ఆమెకి ఒక సంబంధం కుదురుతుంది. ప్రసాద్ తో ఆమె పెళ్లికి ముహూర్తం ఖాయమవుతుంది. ఇకపై జాబ్ లేకపోయినా ఫరవాలేదనే ఒక సంతోషంతో ఆమె ఉంటుంది. నిదానంగా తన చదువును పూర్తిచేయవచ్చని భావిస్తుంది. 'వేణు' అనే ఒక యువకుడు ఆమెను మౌనంగా ఆరాధిస్తూ ఉంటాడు. తన మనసులోని  ప్రేమను ఆమెకి చెప్పలేకపోతాడు. 

ఈ నేపథ్యంలో పెళ్లిరోజు రానే వస్తుంది. అర్చన ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంటుంది. అదే సమయంలో అర్చనకి ఒక చేదు నిజం తెలుస్తుంది. ప్రసాద్ తాను ఇష్టపడుతున్న అమ్మాయితో కలిసి ఊరొదిలి వెళ్లిపోయాడనేది దాని సారాంశం. తన పెళ్లి చేసి ఊపిరి పీల్చుకుందామని భావించిన తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక అర్చన నివ్వెరపోతుంది. ఆ తరువాత ఆమె ఏం చేస్తుంది? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది కథ.

జాబ్ చేస్తూ తన తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవాలనేది అర్చన ఆలోచన. సాధ్యమైనంత త్వరగా ఆమె వివాహం చేసి పంపించాలనేది తల్లిదండ్రుల ఆత్రుత. అయితే ఇలాంటి పరిస్థితులలో ఒక వైపున ఆమె కెరియర్ .. మరో వైపున ఆమె వివాహం రెండూ కూడా ప్రశ్నార్థకంగా మారతాయి. ఆ పరిస్థితులను ఆమె ఎలా ఎదుర్కొంటుంది? అనే ఒక ఆసక్తికరమైన అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను తిప్పుతూ వెళ్లాడు.

అర్చన ఉద్యోగ జీవితంలోని ఒడిదుడుకులు .. పెళ్లి సంబంధాల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులతో ఫస్టాఫ్ నడుస్తుంది. ఇక ఈ రెండు సమస్యలకు ఒక పరిష్కార మార్గం దొరికింది అనుకుంటూ ఉండగానే ఆమె జీవితం మరింత చిక్కుల్లో పడుతుంది. అందుకు సంబంధించిన సన్నివేశాలతో సెకండాఫ్ కొనసాగుతుంది.

ఈ కథ మొదలైన దగ్గర నుంచి ఇక పుంజుకుంటుందేమో అనే ఒక ఆలోచనతో ఆడియన్స్ ఎదురు చూస్తుంటారు. అయితే కథలోగానీ .. కదలికలో గాని ఎలాంటి మార్పు ఉండదు. సాధారణంగా ఈ తరహా మలయాళ సినిమాలలో, చివరిలో ఏదో ట్విస్ట్ ఉంటుంది. అలాంటి ఒక ట్విస్ట్ ఏం ఉంటుందా? అని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. చివర్లో ఏదో ఒక అద్భుతం జరగకపోగా, కథను అంతే బలహీనంగా వదిలేసి వెళ్లిపోతుంది.

సాధారణంగా పెళ్లికి వచ్చిన పెద్దలు అక్షతలు వేసి ఆశీర్వదించి .. భోజనాలు చేసి వెళుతుంటారు. ఒకవేళ పెళ్లి ఆగిపోయినా యువతులు కుమిలిపోతూ కూర్చోవలసిన అవసరం లేదు. పెద్దలు డీలాపడిపోయి వెనుదిరగవలసిన అవసరం లేదు. సందడిని కొనసాగించి .. ఆ తరువాత ఆ యువతీ తన భవిష్యత్తుపై ఫోకస్ చేయవచ్చు అనే ఒక చిన్నపాటి సందేశం ఈ కథలో కనిపిస్తుంది. కాకపోతే అది బలంగా నాటుకోవడానికి అవసరమైన సన్నివేశాలు పడలేదు. 

పల్లె వాతావరణం .. అక్కడ పెళ్లి జరిగే తంతు .. తాగుబోతుల హడావిడి .. ఒకే కలర్ శారీస్ కట్టుకోవాలనే మహిళల ఆలోచన .. మ్యూజికల్ నైట్స్ .. ఈ తరహా వాతావరణం సెట్ చేయడంలో కొంతవరకూ సక్సెస్ అయ్యారు. కాకపోతే కథలో బలం లేని కారణంగా అవి కనెక్ట్ కాలేకపోయాయి. పాత్రల పరంగా చెప్పుకోవడానికిగానీ, నటన పరంగా చెప్పుకోవలసిన పరిస్థితిగాని మనకి ఎక్కడా కనిపించదు. 

ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ..ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయంతే. కేవలం ఐశ్వర్య లక్ష్మి పాత్ర చుట్టూ మాత్రమే వేసుకున్న సింపుల్ లైన్ ఇది. ప్రేక్షకులను ఏ మాత్రం ప్రభావితం చేయలేని కంటెంట్ గానే ఇది కనిపిస్తుంది.