కన్నీళ్లు పెట్టించే మహారాష్ట్ర విషాదం.. గంటలపాటు కుమారుడిని ప్రాధేయపడిన తల్లి

Heartbreaking Maharashtra tragedy Mother pleads with son for hours
  • ఐఫోన్ ఈఎంఐపై తండ్రితో గొడవపడి కొండెక్కిన యువకుడు
  • కొడుకును కాపాడేందుకు గంటలపాటు బతిమాలిన తల్లి
  • రక్షించే ప్రయత్నంలో తండ్రీకొడుకులు కొండపై నుంచి జారిపడి మృతి
  • ఆ షాక్‌లో తల్లి కూడా దూకి ఆత్మహత్య
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో కుమారుడిని ఆత్మహత్య నుంచి కాపాడే ప్రయత్నంలో తల్లిదండ్రులు కూడా ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఐఫోన్ ఈఎంఐ చెల్లింపునకు సంబంధించిన వివాదం ఆ కుటుంబంలోని ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. తన కొడుకును ఆత్మహత్య చేసుకోవద్దని తల్లి ప్రాధేయపడటం, కాళ్లమీద కూర్చుని వేడుకోవడం వంటి దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి.

ఝల్తా గ్రామానికి చెందిన కునాల్ చంద్‌గుడే (19) అనే యువకుడు, ఐఫోన్ ఈఎంఐ చెల్లింపు విషయంలో తండ్రితో గొడవపడి, సమీపంలోని కొండపైకి వెళ్లి అంచున నిలబడ్డాడు. సమాచారం అందుకున్న తల్లి సంగీత గంటల తరబడి కొడుకును బతిమాలింది. నేలపై సాష్టాంగపడి, ఏ సమస్యనైనా పరిష్కరించుకుందామని, కిందకు రావాలని కన్నీటితో వేడుకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గ్రామ సర్పంచ్ ఎంతగా నచ్చజెప్పినా కునాల్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

ఈ క్రమంలో తండ్రి మురళీధర్ తన కుమారుడిని అంచు నుంచి వెనక్కి లాగేందుకు ప్రయత్నించగా, ఇద్దరూ పట్టుతప్పి కొండపై నుంచి కింద పడిపోయారు. కళ్ల ముందే భర్త, కుమారుడు ప్రమాదానికి గురికావడంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన సంగీత, కొద్ది క్షణాల్లోనే వారి వెనుకే దూకి ప్రాణాలు విడిచింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలల క్రితమే ఈ కుటుంబం ఇక్కడికి వచ్చిందని, స్థానికులతో పెద్దగా పరిచయాలు లేవని గ్రామస్తులు తెలిపారు. వారు నివసించిన ఇంట్లో పెంపుడు కుక్క ఇప్పటికీ కిటికీలోంచి యజమానుల కోసం ఎదురుచూస్తుండటం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.
Advertisement
Kunal Chandgude
Maharashtra Family Tragedy
iPhone EMI Dispute
Chhatrapati Sambhajinagar News
Jhalta Village Suicide

More Telugu News