ఉయ్యూరులో డయేరియాపై అసత్య ప్రచారం.. బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉంది: మంత్రి నారాయణ

Minister Narayana says false propaganda on Diarrhea in Vuyyuru and patients health is stable
  • కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని నారాయణ మండిపాటు
  • ప్రస్తుతం ఆసుపత్రిలో 9 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడి
  • పరీక్షల నివేదిక ప్రకారం తాగునీటిలో బ్యాక్టీరియా లేదని వెల్లడైందన్న మంత్రి

కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా విస్తరిస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, కొందరు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డయేరియా బాధితులను ఆయన ఈరోజు పరామర్శించారు. స్థానిక 5వ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


ప్రస్తుతం ఆసుపత్రిలో 9 మంది చికిత్స పొందుతున్నారని, బాధితులందరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు.


ఆగస్టు 17న మృతి చెందిన ఒక వ్యక్తి గుండెపోటు కారణంగానే కన్నుమూశారని, ఆ మరణానికి డయేరియాకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి తేల్చిచెప్పారు. ప్రాథమిక నీటి పరీక్షల నివేదిక ప్రకారం తాగునీటిలో ఎలాంటి బ్యాక్టీరియా లేదని వెల్లడైందన్నారు. సమస్యకు కారణం మున్సిపల్ పైప్‌లైన్లా లేక ప్రైవేట్ ఆర్వో ప్లాంట్లా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని వివరించారు.


అమృత్ 2.0 పథకంలో భాగంగా రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో పాత పైప్‌లైన్లను మారుస్తున్నామని, అందులో భాగంగా ఉయ్యూరులో రూ. 98 కోట్లతో పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Minister Narayana
Vuyyuru Diarrhea News
Krishna District Health Update
Amrut 2.0 Scheme Andhra Pradesh
MLA Bode Prasad
Andhra Pradesh Municipal News

More Telugu News