కాంగ్రెస్‌లో సవతుల పోరు.. బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటోంది: సీపీఐ నారాయణ
- కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు తీవ్రమవుతున్నాయన్న నారాయణ
- సీఎం తప్పులు చేయకుండా ఉంటేనే మంత్రుల్లో భయం ఉంటుందని వ్యాఖ్య
- కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్న సీపీఐ నేత
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు తీవ్రమవుతున్నాయని, నాయకుల మధ్య సవతుల పోరు నడుస్తోందని సీపీఐ సీనియర్ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతల అంతర్గత విభేదాల కారణం వల్ల రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకుంటోందని ఆయన ఆరోపించారు.
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో తమ సీపీఐ పార్టీ భాగస్వామి కాదని, గడిచిన శాసనసభ ఎన్నికల్లో కేవలం సీట్ల సర్దుబాటు మాత్రమే చేసుకున్నామని గుర్తుచేశారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తాము ఇస్తున్న సూచనలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుతో ప్రజల్లో కాంగ్రెస్ పాలన పట్ల అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోందని హెచ్చరించారు.