‘స్పిరిట్‌’లో దీపిక 10 శాతం లాభం అడిగారా? సందీప్ వంగా సోదరుడి సంచలన ఆరోపణలు

Deepika Padukone asked for 10 percent profit in Spirit Sandeep Vanga brother sensational allegations
  • ‘స్పిరిట్’ నుంచి దీపిక తప్పుకోవడంపై కొత్త ఆరోపణలు
  • 10 శాతం సినిమా లాభం అడిగారని ప్రణయ్ రెడ్డి వంగా వెల్లడి
  • రెమ్యునరేషన్, పని వేళలపై కూడా చర్చ జరిగిందని వ్యాఖ్య
  • సినిమా కథ, పాత్ర వివరాలు లీక్ చేశారంటూ ఆరోపణలు
  • దీపికతో 18 నెలలు చర్చలు జరిగాయని ప్రణయ్ వెల్లడి
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడం ఇప్పటికే పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా ఈ వివాదంపై సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. దీపిక రెమ్యునరేషన్, పని గంటలతో పాటు సినిమా లాభాల్లో వాటా కూడా అడిగారని ఆయన ఆరోపించారు.

ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. దీపికా పదుకొణె సినిమా లాభాల్లో 10 శాతం వాటా కోరారని చెప్పారు. ఆమె ఏదైనా డిమాండ్ చేయవచ్చని, అయితే సినిమా బడ్జెట్‌కు ఆ డిమాండ్ సరిపోవాలని అన్నారు. ఆర్థికంగా లెక్కలు సరిపోకపోవడంతో ఇతర ఆప్షన్ల కోసం వెతికామని తెలిపారు.

దీపికతో సందీప్ సుమారు 18 నెలల పాటు మాట్లాడారని ప్రణయ్ తెలిపారు. సినిమా కథ, పాత్రకు సంబంధించిన వివరాలను ఆమెతో చర్చించామని చెప్పారు. అయితే తమ మధ్య అంతర్గతంగా జరిగిన చర్చలు బయటకు వెళ్లడంతో తాము అసంతృప్తికి గురయ్యామని ప్రణయ్ ఆరోపించారు.

దీపికను మార్చడానికి ప్రధాన కారణాల్లో రెమ్యునరేషన్, పని వేళలు ఉన్నాయని ప్రణయ్ చెప్పారు. ఇది కేవలం అదనంగా రూ.5-6 కోట్లు అడిగిన వ్యవహారం కాదని స్పష్టం చేశారు.

ఈ వివాదం సమయంలో సందీప్ రెడ్డి వంగా కూడా ‘ఎక్స్‌’లో ఓ పోస్ట్ చేశారు. పేరు చెప్పకుండా ఓ నటిని ఉద్దేశిస్తూ.. కథను నమ్మకంతో చెప్పిన తర్వాత ఆ వివరాలు బయటకు చెప్పడం సరికాదని అన్నారు.
తన కథను బయటకు చెప్పడం, యువ నటిని కించపరచడం వంటి చర్యలను ఆయన ప్రశ్నించారు. “ఇదేనా మీ ఫెమినిజం?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

స్పిరిట్ నుంచి తప్పుకోవడానికి ముందు దీపిక 8 గంటలు మాత్రమే పనిచేస్తానని కోరినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై గతంలో ఆమె స్పందిస్తూ.. తాను అడిగింది అన్యాయమైన డిమాండ్ కాదని చెప్పారు.
మహిళా నటిగా మాత్రమే కాకుండా, చాలా మంది పురుష నటులు కూడా ఏళ్లుగా 8 గంటల షిఫ్ట్‌లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

దీపిక స్థానంలో త్రిప్తి డిమ్రీని హీరోయిన్‌గా తీసుకున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ 2027 మార్చిలో విడుదల కానుంది.
Advertisement
Deepika Padukone
Sandeep Reddy Vanga
Spirit Movie
Prabhas
Pranay Reddy Vanga
Triptii Dimri

More Telugu News