'నేను మీకంటే ఎక్కువ ఇండియన్'.. పానీపూరి తింటూ జాంటీ రోడ్స్ సరదా వ్యాఖ్యలు

Jonty Rhodes I am more Indian than you says former cricketer while eating Panipuri
  • నెదర్లాండ్స్‌లో పానీపూరి తింటూ కనిపించిన జాంటీ రోడ్స్
  • కారంగా ఉందా అంటే.. "నేను మీకంటే ఎక్కువ ఇండియన్" అంటూ సరదా కౌంటర్
  • ముంబై, గోవాల్లో నివసించేది తానేనని చమత్కారం
  • భారతదేశంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న మాజీ క్రికెటర్
  • కూతురికి 'ఇండియా' అని పేరు పెట్టుకున్న రోడ్స్
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, వరల్డ్ క్లాస్ ఫీల్డర్ జాంటీ రోడ్స్‌కు భారతదేశం, ఇక్కడి సంస్కృతిపై ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అభిమానాన్ని అత‌డు ఎన్నోసార్లు బహిరంగంగా చాటుకున్నాడు. తాజాగా నెదర్లాండ్స్‌లో పానీపూరి తింటూ అత‌డు చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన భారతీయ అభిమానులు జాంటీ రోడ్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో ఉన్న 'కోయిలా' అనే భారతీయ రెస్టారెంట్‌కు జాంటీ రోడ్స్ వెళ్లాడు. అక్కడ ఎంతో ఇష్టంగా పానీపూరి తింటుండగా, ఒక మహిళ అత‌డిని "పానీపూరి కారంగా ఉందా?" అని అడిగారు. దానికి రోడ్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, "నన్నే అడుగుతున్నారా?" అని ప్రశ్నించాడు. ఆ తర్వాత నవ్వుతూ.. "నేను మీకంటే ఎక్కువ ఇండియన్‌ని" అని సమాధానమిచ్చాడు. అత‌ని పక్కనే ఉన్న ఒక భారతీయుడు కూడా అవునంటూ తలూపారు.

అంతటితో ఆగకుండా, రోడ్స్ ఆ భారతీయుడిని చూపిస్తూ.. "అతను పూణెలో ఉంటాడు, అది నిజమైన ఇండియా కాదు. నేను ముంబై, గోవాల్లో నివసిస్తాను. అదే అసలైన ఇండియా" అని చమత్కరించాడు. ఈ సరదా సంభాషణ మొత్తం వీడియోలో రికార్డ్ అవ్వగా, అది ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

జాంటీ రోడ్స్‌కు భారత్‌తో చాలా ఏళ్లుగా బలమైన అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో చాలా కాలం పాటు ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసి పనిచేశాడు. 2015లో ముంబైలో జన్మించిన తన కుమార్తెకు 'ఇండియా జెన్నె రోడ్స్' అని పేరు పెట్టుకుని భారత్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు. అత‌ని కుమారుడు నాథన్ కూడా 2017లో ఇక్కడే జన్మించాడు. భారతీయ ఆహారం, సంస్కృతి అంటే తనకు ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పాడు. ఈ తాజా వీడియో జాంటీ రోడ్స్‌కు భారత్‌తో ఉన్న ప్రత్యేక బంధాన్ని మరోసారి గుర్తుచేసింది.
Advertisement
Jonty Rhodes
Panipuri
Mumbai Indians
South Africa Cricket
Indian Culture
Rotterdam Netherlands

More Telugu News