సోమాలియా తీరంలో టర్కీ ఆయుధాల నౌక అపహరణ.. భారతీయులతో సహా సిబ్బంది బందీ
- పుంట్‌ల్యాండ్ పరిధిలోని ఎయిల్ జిల్లా మార్రాయా తీరానికి సమీపంలో నౌక అపహరణ
- నౌకలోని 10 మంది సిబ్బందిలో ఆరుగురు భారతీయులు
- పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న విదేశాంగ శాఖ
సోమాలియా తీరంలో టర్కీకి చెందిన ఆయుధాలు, సైనిక పరికరాలను తీసుకెళ్తున్న ఒక భారీ సరుకు రవాణా నౌకను సోమాలియా పైరేట్లు (సముద్రపు దొంగలు) అపహరించిన ఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. కేమరూన్ ఫ్లాగ్‌తో ప్రయాణిస్తున్న 'M/V LUTUF' అనే ఈ నౌక పోలార్ మూవ్‌మెంట్ షిప్పింగ్ సంస్థకు చెందినదిగా గుర్తించారు. సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ పరిధిలోని ఎయిల్ జిల్లా మార్రాయా తీరానికి సమీపంలో 3.5 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తుండగా, సుమారు ఎనిమిది మంది పైరేట్లు ఒక్కసారిగా దాడి చేసి నౌకను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అనంతరం నౌకను నుగాల్ తీరం వైపు మళ్లించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
ఈ అపహరణకు గురైన నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది ఉండగా, వారిలో ఏకంగా ఆరుగురు భారతీయ పౌరులే కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన వారిలో ఒకరు టర్కీకి చెందినవారు, ఒకరు జార్జియా పౌరుడు కాగా, ఇద్దరు సెర్బియాకు చెందిన సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. సోమాలియా రాజధాని మొగదిషులో ఉన్న టర్కీ మిలిటరీ శిక్షణ కేంద్రానికి అవసరమైన అధునాతన ఆయుధాలు, కమ్యూనికేషన్, శాటిలైట్ పరికరాలను ఈ నౌకలో రవాణా చేస్తున్నట్లు సమాచారం. ఈ దాడి వెనుక గతంలో 'M/V Sward' నౌకను అపహరించిన పైరేట్ల ముఠా ప్రమేయం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో టర్కీకి చెందిన విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు గస్తీ కాస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే పైరేట్లకు ఆహార సామగ్రిని అందించడానికి వచ్చిన ఒక చిన్న పడవపై వైమానిక దాడి జరిగి నలుగురు మృతి చెందినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆ దాడి ఎవరు చేశారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం నౌకలో ఉన్న ఆరుగురు భారతీయులతో సహా సిబ్బంది అందరి భద్రతపై ఆందోళన నెలకొనడంతో, విదేశాంగ శాఖ వర్గాలు ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి.