ఆండ్రాయిడ్‌ ఆటో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. కనెక్షన్‌ సమస్యకు గూగుల్‌ చెక్‌!

Android Auto connection issues fixed by Google in new update
  • 17.4 వెర్షన్‌లో అందుబాటులోకి కొత్త అప్‌డేట్‌ 
  • డిస్‌కనెక్షన్‌, స్క్రీన్‌ ఫ్రీజ్‌ సమస్యలు పరిష్కారం
  • 17.1 వెర్షన్‌ తర్వాత సమస్యలు మొదలు
  • 17.2 వెర్షన్‌లోనూ కొనసాగిన సమస్య
  • కొందరికి మూడు నిమిషాలకోసారి కనెక్షన్‌ కట్‌
ఆండ్రాయిడ్‌ ఆటోలో తరచూ కనెక్షన్‌ కట్‌ అవుతున్న సమస్యకు గూగుల్‌ పరిష్కారం చూపించింది. కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. తాజా వెర్షన్‌కు అప్‌డేట్‌ చేస్తే సమస్య పరిష్కారమవుతుందని కంపెనీ తెలిపింది.

ఈ ఏడాది మేలో జరిగిన ఆండ్రాయిడ్‌ షో ఐ/ఓ ఎడిషన్‌లో గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఆటోలో భారీ మార్పులను ప్రకటించింది. కొత్త డిజైన్‌తో పాటు జెమినీ ఫీచర్లు, యూట్యూబ్‌ వీడియోలు చూసే అవకాశం, మెటీరియల్‌ 3 ఎక్స్‌ప్రెసివ్‌ డిజైన్‌ను తీసుకొచ్చింది.

అయితే కొత్త అప్‌డేట్‌ తర్వాత సమస్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా 17.1 వెర్షన్‌ వచ్చిన తర్వాత పలువురు యూజర్లు కనెక్షన్‌ సమస్యలను గుర్తించారు. ఫోన్‌ నుంచి ఆండ్రాయిడ్‌ ఆటో పదేపదే డిస్‌కనెక్ట్‌ అవుతోందని ఫిర్యాదు చేశారు.

తాజాగా గూగుల్‌ కొత్త ఫర్మ్‌వేర్‌ అప్‌డేట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్‌ ఆటో కమ్యూనిటీ స్పెషలిస్ట్‌ వెంకటేశ్‌ ఈ విషయాన్ని సపోర్ట్‌ పేజీలో వెల్లడించారు. కనెక్షన్‌ కట్‌ అవడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఆండ్రాయిడ్‌ ఆటో స్క్రీన్‌ పూర్తిగా ఫ్రీజ్‌ అయ్యే సమస్య కూడా తాజా వెర్షన్‌తో పరిష్కారమవుతుందని తెలిపారు.

యూజర్లు తమ ఆండ్రాయిడ్‌ ఆటో యాప్‌ను 17.4 లేదా అంతకంటే కొత్త వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించారు.

ఈ సమస్య 17.1 వెర్షన్‌తో మొదలైంది. 17.2 వెర్షన్‌ వచ్చిన తర్వాత కూడా కొందరికి ఇబ్బందులు కొనసాగాయి. జులై 10న ఓ యూజర్‌ సపోర్ట్‌ ఫోరమ్‌లో తన సమస్యను వివరించాడు. ప్రతి ఐదు నిమిషాలకు కనెక్షన్‌ కట్‌ అవుతోందని తెలిపాడు. కారు బ్రాండ్‌, ఫోన్‌ మోడల్‌తో సంబంధం లేకుండా సమస్య ఎదురవుతోందని పలువురు యూజర్లు చెప్పారు.

మరో యూజర్‌ అయితే మూడు నిమిషాలకోసారి కనెక్షన్‌ పోతుందని పేర్కొన్నాడు. ముందుగా ఆడియో ఆగిపోతుందని, ఆ తర్వాత కొన్ని సెకన్లకు ఆండ్రాయిడ్‌ ఆటో స్క్రీన్‌ ఫ్రీజ్‌ అవుతుందని వివరించాడు. అనంతరం వైర్‌లెస్‌ కనెక్షన్‌ రిసీవర్‌ ఆండ్రాయిడ్‌ ఆటో సెషన్‌ను మళ్లీ ప్రారంభించేదని తెలిపాడు. ఫోన్‌ రీస్టార్ట్‌ చేసినా సమస్య పరిష్కారం కాలేదని చెప్పాడు.
Advertisement
Android Auto
Google
Connection fix
Software update
Version 17.4
Screen freeze

More Telugu News