బలూచిస్థాన్‌లో సాయుధుల అలజడి.. హైవేల దిగ్బంధం, పాక్ సైన్యంపై మెరుపుదాడులు

Balochistan Unrest Armed Groups Block Highways and Attack Pakistan Army
  • బలూచిస్థాన్‌లో పలు హైవేలను దిగ్బంధించిన సాయుధులు
  • కలత్‌లో పాకిస్థాన్ సైనిక బలగాలపై మెరుపుదాడి
  • ఖరాన్-కరాచీ హైవేపై భారీ వంతెనను ధ్వంసం చేసిన ఫైటర్స్
  • వాణిజ్య వాహనాలను అడ్డగించి కొన్నింటికి నిప్పుపెట్టిన ఘటనలు
  • ఆర్థిక దిగ్బంధనంలో భాగంగానే దాడులు జరుగుతున్నాయని వెల్లడి
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో సాయుధులు మరోసారి రెచ్చిపోయారు. పలు ప్రధాన జాతీయ రహదారులను దిగ్బంధించి, పాకిస్థాన్ భద్రతా బలగాలపై మెరుపుదాడులకు పాల్పడ్డారు. గురువారం కలత్, మస్తుంగ్, ఖరాన్, చాగై, వాషుక్ జిల్లాల్లోని హైవేలపై సాయుధులు దిగ్బంధనాలు ఏర్పాటు చేసి, వాణిజ్య వాహనాలను అడ్డుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

కలత్ ప్రాంతంలో ముందుకు వెళ్తున్న పాకిస్థాన్ సైనిక వాహన శ్రేణిపై సాయుధులు మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు, ఖరాన్-కరాచీ హైవేపై సోత్కగన్ ప్రాంతంలోని ఒక వంతెనను భారీ యంత్రాలతో కూల్చివేశారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. చాగై ప్రాంతంలో, ఇరాన్ సరిహద్దు నుంచి వస్తున్న వాణిజ్య వస్తువుల ట్రక్కులపై ఫైటర్లు దాడి చేసి, రెండు వాహనాలకు నిప్పుపెట్టారు.

బుధవారం కలత్‌లోని మంగుచార్ ప్రాంతంలో జరిగిన ఓ ఐఈడీ పేలుడులో ఆరుగురు పాక్ సైనికులు మరణించినట్లు సమాచారం. ఈ దాడులన్నింటికీ ఇప్పటివరకు ఏ సంస్థ బాధ్యత వహించలేదు. అయితే, గతంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ‘ఆర్థిక దిగ్బంధనం’ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇరాన్ నుంచి చమురు, గ్యాస్ రవాణా చేసే వాహనాలు, బలూచిస్థాన్ నుంచి ఖనిజాలను తరలించే ట్రక్కులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Advertisement
Balochistan
Pakistan Army
Baloch Liberation Army
Highway Blockade
Armed Unrest
Pakistan Security Forces

More Telugu News