కుమార్తె పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేసిన బొత్స సత్యనారాయణ
- స్థానిక సంస్థల ఎన్నికల్లో తన కూతురు పోటీ చేస్తుందన్న బొత్స
- జిల్లా పరిషత్ ఎన్నికల్లో బరిలోకి దింపుతామని వెల్లడి
- అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శ
తన కుమార్తె అనూష రాజకీయ అరంగేట్రంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన కుమార్తె పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో అనూషను బరిలోకి దించుతున్నట్లు స్పష్టం చేశారు.
మరోవైపు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని, బయట మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. డీఎస్సీ అంశంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో అధికార పక్షం బయటకు వెళ్లడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని, రాష్ట్ర చరిత్రలోనే ఇదొక కొత్త విపరీత సంప్రదాయమని విమర్శించారు. ఐదు కోట్ల మంది ప్రజలకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.