హార్ముజ్‌పై ఇరాన్ పట్టు సడలుతోందా? కీలక జలసంధిలో మారుతున్న సమీకరణాలు

Strait of Hormuz Is Iran grip loosening Changing equations in key waterway
  • 2 వారాల్లో ఒమన్‌ మార్గాన్ని ఎంచుకున్న 80 శాతం నౌకలు
  • అమెరికా నౌకాదళ రక్షణతో పెరుగుతున్న నౌకల రాకపోకలు
  • ప్రత్యామ్నాయ మార్గంతో ఇరాన్‌కు టోల్‌ ఆదాయం తగ్గే పరిస్థితి
  • ‘డార్క్‌ షిప్పింగ్‌’కు పాల్పడుతున్న భారీ చమురు నౌకలు
  • హర్మూజ్‌లో మైన్లను తొలగించినట్లు ట్రంప్‌ ప్రకటన
ప్రపంచ ఇంధన రవాణాకు గుండెకాయలాంటి హర్మూజ్‌ జలసంధి ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ కీలక సముద్ర మార్గంపై ఇరాన్‌ ఆధిపత్యం క్రమంగా తగ్గుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా నౌకాదళం కొనసాగిస్తున్న దిగ్బంధం, ప్రత్యామ్నాయ మార్గాల్లో పెరుగుతున్న నౌకల రాకపోకలు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. దీంతో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా హర్మూజ్‌పై ఇరాన్‌ పట్టు బలహీనపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

ట్రాఫిక్‌ దారి మారింది
సముద్ర నౌకల కదలికలను పర్యవేక్షించే మెరైన్‌ట్రాఫిక్‌ గణాంకాల ప్రకారం.. గత వారం హర్మూజ్‌ జలసంధిని కనీసం 95 నౌకలు దాటాయి. అంతకుముందు వారంలో ఈ సంఖ్య 118గా ఉంది. అయితే నౌకలు ఎంచుకుంటున్న మార్గంలో కీలకమైన మార్పు  కనిపించింది. గత రెండు వారాల్లో హర్మూజ్‌ దాటిన నౌకల్లో దాదాపు 80 శాతం ఒమన్‌ వైపు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నాయి.

ఈ మార్గాన్ని ఐక్యరాజ్యసమితి అనుమతించింది. అయితే దీన్ని ఇరాన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇరాన్‌ హెచ్చరికలను పట్టించుకోకుండా అమెరికా రక్షణపై నమ్మకంతో నౌకలు ఈ మార్గంలో సాగుతున్నాయి.

టోల్‌ వసూలు చేసే అవకాశం తగ్గింది
ఇరాన్‌ సూచించిన మార్గాన్ని నౌకలు ఎంచుకోకపోవడంతో ఆ దేశానికి మరో దెబ్బ తగిలింది. జలసంధి మీదుగా వెళ్లే నౌకల నుంచి టోల్‌ వసూలు చేసే అవకాశం తగ్గింది. మధ్యప్రాచ్య దేశాలు కూడా ఈ విధానాన్ని అంగీకరించేందుకు ఆసక్తి చూపడం లేదు.

చీకటి నౌకల రాకపోకలు
సౌదీ అరేబియా, కువైట్‌, యూఏఈ వంటి చమురు ఉత్పత్తి దేశాలు భారీ చమురు నౌకలను హర్మూజ్‌ మీదుగా పంపిస్తున్నాయి. గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ దాటిన తర్వాత అక్కడి నుంచి ఇతర నౌకలకు చమురును బదిలీ చేస్తున్నాయి.

ఇరాన్‌ దాడులను తప్పించుకునేందుకు కొన్ని భారీ నౌకలు తమ ట్రాన్స్‌పాండర్లను ఆపివేస్తున్నాయి. దీంతో వాటి కదలికలను సాధారణ ట్రాకింగ్‌ వ్యవస్థలు కూడా గుర్తించలేకపోతున్నాయి. ఈ రహస్య రాకపోకలను ‘డార్క్‌ షిప్పింగ్‌’గా పిలుస్తున్నారు.

ట్రంప్‌ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హర్మూజ్‌ జలసంధికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. జలసంధిలో ఉంచిన సముద్రపు మైన్లను తొలగించామని తెలిపారు. నౌకాదళ దిగ్బంధం కొనసాగుతోందని స్పష్టం చేశారు.

హర్మూజ్‌ జలసంధి నుంచి సాధారణంగా ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాలో దాదాపు ఐదో వంతు సాగుతుంది. తాజాగా అమెరికా అంచనాల ప్రకారం.. హర్మూజ్‌ మీదుగా, ప్రత్యామ్నాయ మార్గాల గుండా కలిపి రోజుకు సుమారు 1.5 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతోంది. యుద్ధానికి ముందు ఉన్న రోజువారీ 2 కోట్ల బ్యారెళ్ల సగటుకు ఇది చేరువ కావడం గమనార్హం.
Advertisement
Strait of Hormuz
Iran
Donald Trump
US Navy
Oil Transport
Marine Traffic

More Telugu News