అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానితో రామ్ వీడియో కాల్.. ఆర్థిక భరోసా

Ram Pothineni video call with fan suffering from rare disease and financial support
  • అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన రామ్ పోతినేని
  • శశిభవ్యత వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ
  • తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యువతికి జన్యుపరమైన సమస్య
  • రామ్ సినిమాలతోనే భోజనం చేసే అభిమానికి అండగా నిలిచిన హీరో
  • ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చిన మీడియా, ఫ్యాన్స్‌కు రామ్ కృతజ్ఞతలు
ప్రముఖ టాలీవుడ్ కథానాయకుడు రామ్ పోతినేని తన అభిమాని పట్ల గొప్ప మనసు చాటుకున్నారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న ఓ యువతికి అండగా నిలిచి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆమెతో నేరుగా వీడియో కాల్‌లో మాట్లాడి ధైర్యం చెప్పడమే కాకుండా, ఆమె వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు.

తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం, దుప్పలపూడి గ్రామానికి చెందిన సాలాడి శ్రీను, శ్రీదుర్గ దంపతుల కుమార్తె శశిభవ్యత (18) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. కుటుంబంలో మూడు తరాలుగా కొనసాగుతున్న మేనరిక సంబంధాల కారణంగా ఆమె 'లఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ' అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి బారిన పడింది. దీనివల్ల తరచూ ఫిట్స్ రావడం, నరాల సమస్యలు తలెత్తడంతో ఆ యువతి మంచానికే పరిమితమైంది.

శశిభవ్యత మానసిక స్థితి అంతగా నిలకడగా లేకపోయినప్పటికీ, తన అభిమాన హీరో రామ్ పేరు వినగానే ఎంతో ఉత్సాహంగా స్పందిస్తుంటుంది. ఆమెకు ఆహారం తనిపించాలన్నా లేదా మందులు వేయాలన్నా ఆమె తల్లిదండ్రులు రామ్ సినిమాలు, వీడియోలనే చూపిస్తుంటారు. ఈ హృదయవిదారక విషయం మీడియా, సోషల్ మీడియా ద్వారా హీరో రామ్ దృష్టికి వెళ్లింది.

దీనిపై వెంటనే స్పందించిన రామ్, బుధవారం శశిభవ్యతతో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆమె తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. శశిభవ్యత మెడికల్ రిపోర్టులు తనకు అందాయని, ఇకపై ఆమె మందులు, ఇతర వైద్య అవసరాలకు అయ్యే ఖర్చులన్నీ తానే చూసుకుంటానని భరోసా ఇచ్చారు. పాపను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని, మందులు సమయానికి అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. 

ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చిన మీడియా ప్రతినిధులకు, అభిమానులకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు రామ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తమ అభిమాన హీరో స్వయంగా స్పందించి అండగా నిలవడంతో శశిభవ్యత తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Ram Pothineni
Shashibhavyata
Lafora Myoclonic Epilepsy
East Godavari
Tollywood Hero

More Telugu News