ఎన్నికలకు సిద్ధంకండి.. గెలుపే లక్ష్యంగా పని చేయండి: జగన్
- రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో జగన్ భేటీ
- కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న జగన్
- రాబోయే ఎన్నికల్లో వైసీపీదే విజయమని ధీమా
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ఐక్యంగా పని చేయాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నాయకులు, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు, దృష్టి మళ్లించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికలలో ప్రజల ఆమోదాన్ని అడ్డుకోవడానికి అధికార యంత్రాంగాన్ని, పోలీసులను ప్రయోగించే అవకాశం ఉందని, అన్నింటినీ ఎదుర్కొని పోరాటానికి సిద్ధం కావాలని నాయకులకు సూచించారు. వైసీపీకి ఉన్న ప్రజాదరణతో రాబోయే ఎన్నికల్లో విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. మరో ఏడాదిలో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు.