ఇమ్రాన్ ఖాన్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు.. సవాల్ చేయనున్న పాకిస్థాన్ ప్రభుత్వం

Pakistan government to challenge Supreme Court order on shifting Imran Khan to private hospital
  • ఇస్లామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలన్న పాక్ సుప్రీంకోర్టు
  • సుప్రీంకోర్టు ఆదేశాలు చట్టపరమైన పరిమితులకు లోబడి లేవన్న పాక్ న్యాయశాఖ మంత్రి
  • శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి జైలు ప్రాంగణంలో లేదా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స అందించాల్సి ఉంటుందని వ్యాఖ్య

జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనను ఇస్లామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి (షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రి) తరలించి, వైద్య పరీక్షలు అందించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం సవాల్ చేయాలని నిర్ణయించింది.


ఈ ఉత్తర్వులపై పాకిస్థాన్ న్యాయశాఖ మంత్రి ఆజం నజీర్ తారర్ స్పందిస్తూ... సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు చట్టపరమైన పరిమితులకు లోబడి లేవని అభిప్రాయపడ్డారు. చట్టప్రకారం శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీకి జైలు ప్రాంగణంలో లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే చికిత్స అందించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.


ప్రైవేట్ ఆసుపత్రులకు ఖైదీలను తరలించడం వల్ల ఇతర ఖైదీల విషయంలో సమస్యలు వస్తాయని, అందుకే సుప్రీంకోర్టు ఉత్తర్వులను సవరించి, ప్రభుత్వ ఆసుపత్రిలో లేదా నిపుణులైన ప్రభుత్వ వైద్యుల బోర్డు సమక్షంలో చికిత్స అందించేలా మార్పులు చేయాలని కోరుతూ ప్రభుత్వం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుందని ఆయన తెలిపారు.


73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుండి రావల్పిండిలోని అడియాల జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న సమయంలో ఆయన కుడికంటి చూపు మసకబారడంతో పాటు ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలిచ్చింది.
Advertisement
Imran Khan
Pakistan Supreme Court
Pakistan Government
Adiala Jail
Imran Khan health issues
Shifa International Hospital

More Telugu News