పాకిస్థాన్ సుప్రీంకోర్టు సంచలన ఆదేశాల తర్వాత... 9 నెలల తర్వాత భార్య, సోదరిని కలిసిన ఇమ్రాన్ ఖాన్

Imran Khan meets wife and sister after nine months following Pakistan Supreme Court orders
  • రావల్పిండిలోని అడియాల జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్
  • ఇమ్రాన్ ఖాన్‌ను వారానికి ఒకసారి కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించిన సుప్రీంకోర్టు
  • భార్యతో అరగంట సేపు మాట్లాడిన ఇమ్రాన్

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అడియాల జైలులో తన భార్య బుష్రా బీబీ, సోదరి నొరీన్ నియాజీలతో భేటీ అయ్యారు. పాక్ సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాల మేరకు దాదాపు తొమ్మిది నెలల తర్వాత మొదటిసారి వీరిద్దరూ జైల్లో ఇమ్రాన్‌తో ములాఖత్ సందర్భంగా కలిశారు.


పాకిస్థాన్ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన కుటుంబ సభ్యులు వారానికి ఒకసారి కలిసేందుకు అనుమతినిస్తూ మంగళవారం ప్రభుత్వానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలోనే జైలు అధికారులు ఈ భేటీకి ఏర్పాట్లు చేశారు. ఇమ్రాన్ సోదరి నొరీన్ నియాజీ దాదాపు 15 నిమిషాల పాటు ఆయనతో మాట్లాడి... సుప్రీంకోర్టు ఆదేశాలు, ఆయనను ఇస్లామాబాద్‌లోని షిఫా ఆసుపత్రికి తరలించే అంశంపై చర్చించారు. అనంతరం ఇమ్రాన్ ఖాన్ తన భార్య బుష్రా బీబీతో సుమారు 30 నుంచి 35 నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడారు.


కోర్టుకు ఇచ్చిన హామీ ప్రకారం ఇమ్రాన్ సోదరి మీడియాతో ఎలాంటి వివరాలు వెల్లడించకుండా వెనుదిరిగారు. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం ఇన్నాళ్లకు కుటుంబ సభ్యుల కలయిక జరగడంపై ఇమ్రాన్ ఖాన్ మరో సోదరి అలీమా ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు జోక్యంతో తమకు ఈ అవకాశం దక్కిందని ఆమె పేర్కొన్నారు.

Advertisement
Imran Khan
Bushra Bibi
Adiala Jail
Pakistan Supreme Court
Noreen Niazi
PTI Leader

More Telugu News