భారత్‌లో సూర్యుడు ముందుగా ఉదయించే చోటు ఇదే.. వెళ్లాలంటే ఇలా!

This is the place where the sun rises first in India Here is how to visit
  • అరుణాచల్‌ప్రదేశ్‌లోని డోంగ్‌లో దేశంలోనే తొలి సూర్యోదయం
  • అంజావ్‌ జిల్లాలో వాలోంగ్‌ సమీపంలో ఉన్న డోంగ్‌
  • సూర్యోదయం చూసేందుకు తెల్లవారక ముందే కొండల్లో ట్రెక్కింగ్‌
  • 2025 డిసెంబరు 29 నుంచి డోంగ్‌లో తొలి సన్‌రైజ్‌ ఫెస్టివల్‌
  • అక్కడకు వెళ్లేందుకు దిబ్రూగఢ్‌, న్యూ టిన్సుకియా ప్రధాన రవాణా కేంద్రాలు
సూర్యోదయాన్ని చూడాలంటే సముద్ర తీరం, కొండ ప్రాంతాలే గుర్తొస్తాయి. కానీ అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో మాత్రం తెల్లవారుజామునే కొండల్లోకి బయలుదేరాల్సిందే. చీకటిని దాటుకుంటూ వెళ్లిన వారికి దేశంలోనే తొలి సూర్యకిరణాలను చూసే అరుదైన అవకాశం దక్కుతుంది. అదే డోంగ్‌ వ్యాలీ.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని అంజావ్‌ జిల్లాలో ఉన్న డోంగ్‌ గ్రామం సమీపంలో ఈ లోయ ఉంది. వాలోంగ్‌ ప్రాంతానికి దగ్గరగా, లోహిత్‌ నది పరివాహక ప్రాంతంలో ఇది విస్తరించింది. దేశంలో తొలిగా సూర్యోదయం కనిపించే ప్రాంతాల్లో డోంగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

తెల్లవారక ముందే కొండల్లోకి..
డోంగ్‌లో సూర్యోదయాన్ని చూడాలంటే ముందుగానే ప్రయాణం మొదలుపెట్టాలి. చీకట్లో కొండ మార్గాల గుండా ట్రెక్కింగ్‌ చేస్తూ వ్యూపాయింట్‌కు చేరుకోవాలి. కాలానుగుణంగా సూర్యోదయ సమయం దాదాపు 4:20 గంటల నుంచి 4:40 మధ్య ఉంటుంది. అందుకే స్థానికుల సూచనలు తీసుకోవడం మంచిది. అక్కడి నుంచి లోయ, అడవులు, కొండల మధ్య నుంచి సూర్యుడు పైకి వచ్చే దృశ్యం అద్భుతంగా ఉంటుంది.

డోంగ్‌ చుట్టుపక్కల వాలోంగ్‌, కిబితూ ప్రాంతాలను కూడా చూడొచ్చు. లోహిత్‌ నది, పచ్చని కొండలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. మేయర్‌ సముదాయం సంప్రదాయాలు కూడా ఈ ప్రాంతానికి ప్రత్యేకత తీసుకొస్తాయి.

పర్యాటక ఉత్సవానికి వేదికగా..
డోంగ్‌ సూర్యోదయానికి ఇప్పుడు పర్యాటక ప్రాధాన్యం మరింత పెరిగింది. 2025 డిసెంబరు 29 నుంచి 2026 జనవరి 2 వరకు అరుణాచల్‌ప్రదేశ్‌ తొలి సన్‌రైజ్‌ ఫెస్టివల్‌ నిర్వహించింది. సూర్యోదయ ట్రెక్కింగ్‌, సాంస్కృతిక కార్యక్రమాలు, స్థానిక వంటకాలు, హస్తకళలు ఇందులో భాగమయ్యాయి.

డోంగ్‌ వెళ్లాలంటే అసోంలోని దిబ్రూగఢ్‌ విమానాశ్రయం, న్యూ టిన్సుకియా రైల్వే స్టేషన్‌ ప్రధాన మార్గాలు. టిన్సుకియా, తేజు, హయులియాంగ్‌, వాలోంగ్‌ మీదుగా రోడ్డు ప్రయాణం సాగుతుంది. సరిహద్దు ప్రాంతం కావడంతో ప్రయాణానికి ముందు ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ (ఐఎల్‌పీ), స్థానిక నిబంధనలు తెలుసుకోవాలి.
Advertisement
Dong Valley
Arunachal Pradesh
First Sunrise in India
Walong Trekking
Kibithu Tourism
Sunrise Festival Arunachal

More Telugu News