ఆ వ్యక్తితో ప్రేమలో ఉన్నప్పుడు తీవ్ర క్షోభకు గురయ్యాను: అనుపమ పరమేశ్వరన్
- స్త్రీలకు వచ్చే పీరియడ్స్ ప్రక్రియను కూడా చులకనగా చూసేవాడన్న అనుపమ
- ఆయన తప్పులను ప్రశ్నిస్తే నీకు పీరియడ్స్ సమయమా అని హేళన చేసేవాడని వెల్లడి
- ఆ చేదు అనుభవాల వల్ల తనకు పిల్లలే వద్దనే నిర్ణయానికి వచ్చానన్న అనుపమ
నటి అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన అత్యంత చేదు అనుభవాలను బయటపెడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్లు, అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో తాను ఒక వ్యక్తితో రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న సమయంలో తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెలా స్త్రీలకు సహజంగా జరిగే పీరియడ్స్ ప్రక్రియను కూడా అతడు చాలా చులకనగా చూసేవాడని, అతని తప్పులను ప్రశ్నిస్తే "నీకు పీరియడ్స్ సమయమా? మూడ్ స్వింగ్స్ వల్లే ఇలా మాట్లాడుతున్నావు" అంటూ హేళన చేసేవాడని చెప్పారు. ఆ వ్యాఖ్యల వల్ల తన ఉనికిపై తనకే అసహ్యం వేసేదని, నటిగా సమాజంలో ధైర్యంగా నిలబడే తనకు ఆ సమయంలో తీవ్రమైన డిప్రెషన్ ఎదురైందని తెలిపారు.
ఈ విషపూరితమైన బంధం వల్ల తన జీవిత ఆలోచనలే మారిపోయాయని ఆమె పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి తనకు 11 మంది పిల్లలు ఉండాలని కోరిక ఉండేదని, కానీ ఆ వ్యక్తి వల్ల కలిగిన చేదు అనుభవాల తర్వాత భవిష్యత్తులో అసలు పిల్లలే వద్దనే నిర్ణయానికి వచ్చానని వెల్లడించారు. ప్రస్తుతం ఆ మానసిక క్షోభ నుంచి బయటపడి కెరీర్‌పై దృష్టి పెడుతున్నట్లు అనుపమ తెలిపిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.