యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో సంపాదిస్తున్నారా? ఆగస్టు 31 మిస్‌ అయితే ఇబ్బందే!

Earning on YouTube and Instagram Filing ITR by August 31 is Mandatory
  • సోషల్‌ మీడియా ఆదాయానికీ పన్ను నిబంధనలు
  • ఆగస్టు 31 ఐటీఆర్‌ దాఖలుకు కీలక గడువు
  • యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఆదాయాలన్నీ లెక్కించాలి
  • అఫిలియేట్‌, మెంబర్‌షిప్‌ ఆదాయాలనూ చూపించాలి
  • కొందరికి జీఎస్‌టీ, టీడీఎస్‌ నిబంధనలు వర్తించొచ్చు
ఒకప్పుడు సోషల్‌ మీడియాలో వీడియోలు చేయడం సరదా. ఇప్పుడు అదే వీడియోలు చాలామందికి పూర్తిస్థాయి ఆదాయ మార్గం. యూట్యూబ్‌ యాడ్స్‌ నుంచి వచ్చే డబ్బు.. ఇన్‌స్టాగ్రామ్‌ బ్రాండ్‌ డీల్స్‌.. అఫిలియేట్‌ కమీషన్లు.. మెంబర్‌షిప్‌లు.. సూపర్‌చాట్లు.. ఒక్కో మార్గం నుంచి ఒక్కో రూపంలో ఆదాయం వస్తోంది. అయితే ఈ సంపాదనకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటే మాత్రం పొరపాటే. కంటెంట్‌ క్రియేటర్లకు ఆగస్టు 31 కీలక గడువు. అసలు ఏం చేయాలి? ఏ ఆదాయాన్ని ఎలా చూపించాలి?

సోషల్‌ మీడియా సంపాదనకూ పన్ను
కంటెంట్‌ క్రియేషన్‌ క్రమం తప్పకుండా చేస్తూ దాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటే.. ఆ సంపాదన సాధారణంగా వ్యాపారం లేదా వృత్తి నుంచి వచ్చిన ఆదాయంగా పరిగణిస్తారు. యూట్యూబ్‌ యాడ్‌సెన్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ బ్రాండ్‌ ప్రమోషన్లు మాత్రమే కాదు. అఫిలియేట్‌ లింకులు, ప్లాట్‌ఫామ్‌ చెల్లింపులు, మెంబర్‌షిప్‌లు, సూపర్‌చాట్లు, మెర్చండైజ్‌ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బునూ లెక్కలోకి తీసుకోవాలి.

ఆగస్టు 31 ఎందుకు కీలకం?
2025-26 ఆర్థిక సంవత్సరానికి వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం పొందుతున్న, ఆడిట్‌ అవసరం లేని పన్ను చెల్లింపుదారులకు ఆగస్టు 31 ఐటీఆర్‌ దాఖలు గడువు. క్రియేటర్లు ఒక్కో ప్లాట్‌ఫామ్‌ నుంచి వేర్వేరు సమయాల్లో చెల్లింపులు పొందుతారు. దీంతో చిన్న మొత్తాలను మర్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగానే ఆదాయం మొత్తం నమోదు చేసుకోవడం కీలకం.

ఏ ఐటీఆర్‌ దాఖలు చేయాలి?
క్రియేటర్‌ ఆదాయం ఎలా వస్తోంది? వ్యాపార నిర్మాణం ఏంటి? పన్ను నిబంధనల ప్రకారం ఏ పద్ధతికి అర్హత ఉంది? అన్నదాన్ని బట్టి ఐటీఆర్‌ మారుతుంది. అర్హత ఉన్నవారు కొన్ని షరతులకు లోబడి ప్రిజంప్టివ్‌ ట్యాక్సేషన్‌ కింద ఐటీఆర్‌-4ను ఎంచుకోవచ్చు. మిగతావారు ఐటీఆర్‌-3 దాఖలు చేయాల్సి రావచ్చు. అందుకే మరో క్రియేటర్‌ ఏ ఫారం వాడుతున్నారో చూసి అదే పద్ధతిని అనుసరించడం సరికాదు.

జీఎస్‌టీ, టీడీఎస్‌ కూడా కీలకమే
ఆదాయం పెరిగితే కేవలం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌తో వ్యవహారం ముగియదు. టర్నోవర్‌, సేవల స్వభావాన్ని బట్టి జీఎస్‌టీ నిబంధనలు వర్తించొచ్చు. బ్రాండ్‌ల నుంచి వచ్చే కొన్ని చెల్లింపులపై టీడీఎస్‌ కూడా ఉండొచ్చు. కంపెనీలు ఉచితంగా ఇచ్చే ఫోన్లు, కెమెరాలు, ట్రిప్పులు, ఇతర వస్తువులకు కూడా కొన్ని పరిస్థితుల్లో పన్ను ప్రభావం ఉండొచ్చు.

వ్యూస్‌ పెరిగితే ఆదాయం పెరుగుతుందా?
యూట్యూబ్‌ ఆగస్టు 24 నుంచి వ్యూస్‌ లెక్కింపులో మార్పు తీసుకురానుంది. వీడియో ప్లే కావడం మొదలైన వెంటనే వ్యూ లెక్కలోకి వచ్చే విధానం అమల్లోకి రానుంది. దీంతో వ్యూస్‌ వేగంగా పెరిగినట్లు కనిపించొచ్చు. అయితే దీనివల్ల ఆదాయం ఆటోమేటిక్‌గా పెరగదు. సంపాదన లెక్కల్లో యూట్యూబ్‌ ఎంగేజ్డ్‌ వ్యూస్‌ ప్రమాణాన్ని కొనసాగించనుంది.

కంటెంట్‌ క్రియేషన్‌ను హాబీగా కాకుండా వ్యాపారంగా చూస్తున్నవారు ఆదాయం, ఖర్చులన్నింటికీ సరైన రికార్డులు నిర్వహించడం మంచిది. ఇది పన్ను సమస్యలను తగ్గించడంతో పాటు భవిష్యత్తులో బ్యాంకు రుణాలు, బ్రాండ్‌ ఒప్పందాలు, పెట్టుబడుల సమయంలోనూ ఉపయోగపడుతుంది.
Advertisement
Content Creators
YouTube Income Tax
Instagram Earnings ITR
Income Tax Deadline August 31
ITR for YouTubers
Social Media Influencer Tax Rules

More Telugu News