కామెడీ ప్రధానమైన కథలను తెరకెక్కించడంలో దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డికి మంచి నైపుణ్యం ఉంది. 'సీమశాస్త్రి'.. 'సీమటపాకాయ్' .. 'దేనికైనా రెడీ' సినిమాలు ఆయన మార్క్ ఏమిటనేవి చూపిస్తాయి. అలాంటి ఆయన శ్రీకాంత్ కథానాయకుడిగా రూపొందించిన సినిమానే 'మిస్టర్ మిడిల్ క్లాస్'. శ్రీకాంత్ సరసన లయ నటించగా, ఇతర కీలకమైన పాత్రలలో రాజేంద్రప్రసాద్ .. వెన్నెల కిశోర్ .. రఘుబాబు .. పృథ్వీ కనిపించనున్నారు. జులై 17వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఈ రోజు ( ఆగస్టు 19) నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.

వెంకటరమణ (శ్రీకాంత్) పద్మావతి (లయ) భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు. వెంకటరమణ తండ్రి ఏడు కొండలు (మురళీధర్ గౌడ్) అతని చెల్లెలు కరుణ - బావ శ్రీను కూడా అదే ఇంట్లో ఉంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వెంకటరమణకు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎంతమాత్రం లేని కోటీశ్వరుడు కావాలనేది కోరిక. ఆ దురాశ కారణంగానే అతను పెద్ద హోటల్ పెట్టి అప్పులపాలవుతాడు. అదే హోటల్లో ఆ ఫ్యామిలీ అంతా పనివాళ్లుగా చేరే పరిస్థితి వస్తుంది. అలా వచ్చిన డబ్బుతోనే అప్పులు తీరుస్తూ వెళుతుంటారు. 

 ఒకానొక దశలో అతను తాను బలంగా నమ్మే వేంకటేశ్వరస్వామి గుడి దగ్గరే నైట్ వాచ్ మెన్ గా కుదురుతాడు. భార్య ఆయాగా చేరవలసిన పరిస్థితి వస్తుంది. ఆ దేవుడు ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి తనని బయటపడేయక పోవడం వలన, ఆత్మహత్య చేసుకోవాలని వెంకటరమణ నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఆ స్వామి (రాజేంద్రప్రసాద్) ప్రత్యక్షమై, తన విలువైన ఆభరణాలను అతనికి ఇస్తాడు. అయితే అవి గిల్ట్ నగలు అనుకుని, పద్మావతి వాటిని చెరువులో పారేస్తుంది. 

ఈ విషయం తెలుసుకున్న స్వామి, వెంకటరమణకు 13 పేజీలను కలిగిన ఒక 'బుక్' ఇస్తాడు. ఆ బుక్ లో అతను ఏది రాస్తే అది జరుగుతుందని చెబుతాడు. కొన్ని నియమాలు చెప్పి వాటి ప్రకారమే చేయాలని అంటాడు. బుక్ క్రింద పడిపోతే తన శక్తిని కోల్పోతుందని చెబుతాడు. ఆ తరువాత వెంకటరమణకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అందుకు తగినట్టుగా ఆ బుక్ లో అతను ఏమేం రాస్తూ వెళతాడు? అందువలన అతని జీవితంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి? అనేదే కథ.

శ్రీమంతుల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయేమోగానీ, మిడిల్  క్లాస్ కుటుంబానికి చెందిన వాళ్లందరి ఆలోచనలు దాదాపు ఒకే రకంగా ఉంటాయని అంటారు. ఉమ్మడి కుటుంబం .. అవసరాలు .. అప్పుల మధ్యలో వాళ్లు సతమతమైపోతుంటారు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం, సాధ్యమైనంత తొందరగా డబ్బు సంపాదించాలని ఆరాటపడతారు. అలా ఆశపడే వెంకటరమణ అనే పాత్ర చుట్టూ రాసుకున్న కథ ఇది.

మిడిల్ క్లాస్ కుటుంబాలకు చెందినవారు జీవితం పట్ల భయము - భద్రత రెండూ కనబరుస్తూ ఉంటారు. తమకి సహకరించమని దేవుడి పాదాలను ఆశ్రయిస్తుంటారు. అలాంటి పరిస్థితులలో దేవుడే దిగి వచ్చి వాళ్లకు వరాలను ఇస్తే, వాళ్ల తలరాతను మార్చుకునే అవకాశం వారికే ఇస్తే ఎలా ఉంటుంది? అనే ఒక ఆలోచన నుంచి ఈ కథ పుట్టిందని చెప్పకోవచ్చు. 

ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరయ్యే ఒక మధ్యతరగతి మానవుడికి, దేవుడే ప్రత్యక్షమై వరాలనిస్తే, అతను సద్వినియోగం చేసుకున్నాడా? దుర్వినియోగం చేసుకున్నాడా? అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతూ వెళుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి పాత్రను దర్శకుడు డిజైన్ చేస్తూ వెళ్లిన విధానం ఆడియన్స్ కి అవసరమైన వినోదాన్ని పంచుతుంది.మానవుడి కోరిక .. దేవుడి వరం అనే రెండు ప్రధానమైన అంశాలను టచ్ చేస్తూ సాగే ఈ కథ, బోర్ అనిపించకుండా సరదాగా సాగిపోతూ ఉంటుంది. 

తాము బాగుపడాలనే కోరికతో పాటు, ఇతరులు చెడిపోవాలనే మానవుల సహజమైన అసూయ ద్వేషాలను కూడా దర్శకుడు ఆవిష్కరించిన విధానం మెప్పిస్తుంది. ముఖ్యంగా దేవుడిచ్చిన బుక్ కోసం కొంతమంది స్వార్థపరులు ప్రయత్నించడం .. ఆ బుక్ చేతులు మారుతూ వెళ్లడం సరదాగా నవ్విస్తుంది. అలాగే స్వామివారే స్వయంగా ఆభరణాలు ఒలిచి ఇచ్చారని చెబితే కుటుంబ సభ్యులు నమ్మకపోవడం కూడా సరదాగా అనిపిస్తుంది.

ఫస్టాఫ్ లో స్వామివారి ఆభరణాలకు సంబంధించిన సన్నివేశాలు, సెకండాఫ్ లో స్వామివారు ఇచ్చిన 'బుక్' కి సంబంధించిన సన్నివేశాలు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. నాగేశ్వరరెడ్డి కామెడీపై తనకి గల పట్టును మరోసారి నిరూపించాడు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు. గ్రాఫిక్స్ కి సంబంధించిన వర్క్ బాగుంది. శ్రీకాంత్ .. లయ .. రాజేంద్రప్రసాద్ నటన చాలా సహజంగా అనిపిస్తుంది. సునీల్ .. వెన్నెల కిశోర్ .. రఘుబాబు .. పృథ్వీ కామెడీ కూడా సందడి చేస్తుంది.  

 దణ్ణం పెట్టుకోగానే దేవుడు ప్రత్యక్షమైతే .. కోరగానే కోరికలు తీర్చుకునే అవకాశం ఇస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటారు. అలానే జరిగితే ఆ మనిషి ఎలాంటి ఇబ్బందులలో పడతాడో చూపించే కంటెంట్ ఇది. ఎవరికి ఏది ఇవ్వాలో .. ఎప్పుడు ఇవ్వాలో దైవానికి తెలుసు. ఆశపడిపోయి .. ఆరాటపడిపోయి పరుగులు పెడితే ఏం జరుగుతుందనేది వినోదభరితంగా ఆవిష్కరించిన సినిమా ఇది. ఇతరులకు సాయం చేసేవారికే, దేవుడు సాయం చేస్తాడనే ఒక సందేశాన్ని ఇచ్చే ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి సరదాగా చూడొచ్చు.