నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న నటి నిధి అగర్వాల్
- ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రచారం కేసు
- పలువురు సినీ ప్రముఖుల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చిన ఈడీ
- నేడు నిధి అగర్వాల్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్న ఈడీ అధికారులు
ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రచారం కేసులో సినీ నటి నిధి అగర్వాల్ నేడు ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరుకానున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు ప్రచారం కల్పించారనే ఆరోపణలతో ఈడీ అధికారులు ఆమెకు ముందస్తుగా సమన్లు జారీ చేశారు. ఈరోజు ఆమె స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డ్ చేయనున్నారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణంలో సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్న ఈడీ... బెట్టింగ్ యాప్‌ల ప్రచారంలో సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాత్రపై ప్రధానంగా దృష్టి సారించింది. మియాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త ఫణీంద్ర శర్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన అధికారులు... ప్రముఖుల ప్రకటనల వల్ల ప్రజలు బెట్టింగ్ యాప్‌లలో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో నిధి అగర్వాల్‌తో పాటు రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, అనన్య నాగళ్ల వంటి పలువురు సినీ ప్రముఖులు, ఇన్‌ఫ్లుయెన్సర్ల పేర్లను కూడా చేర్చారు.