సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజమ్ ఖాన్ ట్రస్ట్, యూనివర్సిటీల్లో ఈడీ సోదాలు

ED raids Samajwadi Party leader Azam Khan Trust and University
  • మొత్తం 10 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న ఈడీ
  • ప్రభుత్వ కాంట్రాక్ట్ నిధులను ట్రస్ట్, యూనివర్శిటీ నిర్మాణాలకు వాడారని ఆరోపణలు
  • యూనివర్శిటీలోని 38 భవనాలకు ఇటీవలే కూల్చివేత నోటీసులు

సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం జైల్లో ఉన్న ఆజమ్ ఖాన్‌కు చెందిన మౌలానా మొహమ్మద్ అలీ జౌహార్ ట్రస్ట్, మొహమ్మద్ అలీ జౌహార్ యూనివర్సిటీ లక్ష్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. పీఎంఎల్ఏ (PMLA) చట్టం కింద నమోదైన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి లక్నో ఈడీ జోనల్ విభాగం ఈరోజు ఈ తనిఖీలను నిర్వహిస్తోంది.


ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్, సహారన్‌పూర్ తో పాటు ఢిల్లీలోని జమియా నగర్‌తో సహా మొత్తం 10 ప్రదేశాల్లో సీఆర్పీఎఫ్ పటిష్ట భద్రత నడుమ ఈ దాడులు కొనసాగుతున్నాయి. సహారన్‌పూర్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ నివాసంతో పాటు ట్రస్ట్‌తో సంబంధమున్న రెండు కంపెనీలు, వాటి ప్రమోటర్ల ఇళ్లల్లో కూడా ఈడీ తనిఖీలు చేస్తోంది. ప్రైవేట్ కాంట్రాక్టర్ల ద్వారా ప్రభుత్వ కాంట్రాక్ట్ నిధులను మళ్లించి, ఆ సొమ్మును జౌహార్ ట్రస్ట్, యూనివర్సిటీ ఆస్తుల నిర్మాణానికి విరాళాలుగా వాడినట్లు అధికారులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.


ఈ జౌహార్ ట్రస్ట్‌కు ఆజమ్ ఖాన్ ప్రధాన ట్రస్టీగా వ్యవహరిస్తుండగా, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఇతర ట్రస్టీలుగా ఉన్నారు. 2006లో ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాంపూర్‌లో స్థాపించిన జౌహార్ యూనివర్సిటీలోని 40 భవనాల్లో 38 భవనాలు అనుమతులు లేకుండా నిర్మించారంటూ రాంపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఇటీవల కూల్చివేత నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది.

Advertisement
Azam Khan
Enforcement Directorate
Mohammad Ali Jauhar University
Money Laundering Case
Samajwadi Party
Rampur

More Telugu News