5జీతో వేగం.. 6జీ పైనా భారత్ దృష్టి.. నివేదికలో ఆసక్తికర విషయాలు!

India 5G speed and 6G focus interesting facts from GSMA report
  • 2030 నాటికి భారత్‌లో 62 శాతానికి చేరనున్న 5జీ వినియోగం
  • ఆసియా పసిఫిక్‌ సగటును అధిగమించనున్న ఇండియా
  • కవరేజీ కంటే వినియోగం పెంచడమే అసలు సవాల్ అని వెల్లడి
  • భారత్ డిజిటల్ ప్రగతిపై జీఎస్ఎంఏ నివేదికలో ప్రశంసలు
5జీ టెక్నాలజీ వినియోగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవనుందని, 2030 నాటికి దేశంలో 5జీ స్వీకరణ 62 శాతానికి చేరుకుంటుందని 'గ్లోబల్ మొబైల్ కమ్యూనికేషన్స్ సిస్టమ్'(జీఎస్ఎంఏ) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంత సగటు 50 శాతం కంటే గణనీయంగా ఎక్కువ కావడం విశేషం. ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్, ఇండోనేషియా, పాకిస్థాన్‌లతో పాటు భారత్‌ను కూడా 'ప్రముఖ దేశం'గా జీఎస్ఎంఏ గుర్తించింది.

ఒకప్పుడు నెట్‌వర్క్ కవరేజీ పెద్ద సవాల్‌గా ఉండగా, ఇప్పుడు దేశంలో ఆ సమస్య దాదాపు పరిష్కారమైందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం కవరేజీ గ్యాప్ 5 శాతానికి పడిపోవడంతో అసలు సవాల్ కవరేజీ నుంచి వినియోగం, స్వీకరణ వైపు మారిందని తెలిపింది. స్మార్ట్‌ఫోన్ల ధరలు, డిజిటల్ నైపుణ్యాల కొరత, ఆన్‌లైన్ భద్రతపై నమ్మకం వంటివి మొబైల్ ఇంటర్నెట్ వాడకానికి ప్రధాన అవరోధాలుగా ఉన్నాయని వివరించింది.

ఈ సవాళ్లను అధిగమించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను నివేదిక ప్రశంసించింది. 'భారత్‌నెట్', 'ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ (పీఎంజీదిశ)' వంటి పథకాలను ఉదాహరణగా పేర్కొంది. పీఎంజీదిశ ద్వారా ఇప్పటికే 6.4 కోట్ల మంది గ్రామీణ పౌరులకు డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చినట్లు గుర్తు చేసింది. అదే సమయంలో డిజిటల్ నమ్మకాన్ని పెంపొందించడం కూడా భారత్‌కు ఆర్థిక ప్రాధాన్యతగా మారుతోందని, 2026 నాటికి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీపై చేసే ఖర్చు 11.7 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. ఇందుకు దేశంలో అమలవుతున్న డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం దోహదపడుతోందని తెలిపింది.

టెక్నాలజీలో స్వావలంబనపై భారత్ దృష్టి సారించిందని, 'ఆత్మనిర్భర్ భారత్' విధానం ఇందుకు నిదర్శనమని నివేదిక పేర్కొంది. బీఎస్ఎన్ఎల్ దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ టెక్నాలజీని వాడటం, దానిని 5జీకి అప్‌గ్రేడ్ చేసుకునే వీలుండటం గొప్ప విషయమని తెలిపింది. అంతేకాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారత్ ఇప్పటికే 6జీ స్పెక్ట్రమ్ రోడ్‌మ్యాప్‌ను కూడా ప్రకటించడం దాని దీర్ఘకాలిక ప్రణాళికకు అద్దం పడుతోందని వివరించింది. 5జీ, కృత్రిమ మేధ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటివి తయారీ, సేవల రంగాల్లో ఉత్పాదకతను గణనీయంగా పెంచుతాయని నివేదిక అంచనా వేసింది.
Advertisement
India
5G technology adoption
GSMA report 2030
India 6G roadmap
Digital India initiatives
Atmanirbhar Bharat telecom

More Telugu News