మేము అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇస్తాం: కవిత
- భూ లక్ష్మి పథకం కింద పేదలకు ఎకరం చొప్పున ఇస్తామన్న కవిత
- రేవంత్ రెడ్డికి భూమి అంటే కేవలం వ్యాపార లావాదేవీలేనని విమర్శ
- రాష్ట్రంలో రేవంత్, భట్టి విక్రమార్క కుటుంబ సభ్యుల దోపిడీ సాగుతోందని ఆరోపణ
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘భూ లక్ష్మి పథకం’ కింద భూమి లేని పేదలకు ఎకరం చొప్పున ఇస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భూమి అంటే కేవలం వ్యాపార లావాదేవీలే కావచ్చు కానీ, పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు భూమి, అడవి అంటే పంచప్రాణాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా ముందుగా పేదల అసైన్డ్ భూములనే లాక్కుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సోదరులు, భట్టి విక్రమార్క కుటుంబ సభ్యుల దోపిడీ, రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం దాదాపు 30 వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కుందని, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్లుగా పేదల అసైన్డ్ భూములపై వారికే పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డి ‘మేకవన్నె పులి’ లాంటి వారని... ఆయన చెప్పేది సామాజిక న్యాయం అయితే, చేసేది ఆటవిక న్యాయమని విమర్శించారు. కేబినెట్ తో పాటు ప్రభుత్వ సలహాదారులు, ఆర్టీఐ కమిషనర్ల నియామకాల వరకు బడుగు, బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అగ్రవర్ణాలకు ఒక న్యాయం, పేదలకు మరొక న్యాయం నడుస్తోందని మండిపడ్డారు.