రూ.1 లక్షతో తీసిన సినిమా.. రూ.20 కోట్ల వసూళ్లు.. అసలు ఏముంది దాంట్లో?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ.1 లక్షతో తీసిన సినిమా.. రూ.20 కోట్ల వసూళ్లు.. అసలు ఏముంది దాంట్లో?

Niu Lai movie made with one lakh collects 20 crores at box office
  • భారీ కలెక్షన్లు వసూలు చేస్తోన్న చైనా యానిమేషన్‌ సినిమా ‘నియు లై’
  • రూ.లక్ష బడ్జెట్‌తో ఇద్దరు వ్యక్తులు మాత్రమే నిర్మించిన వైనం
  • చెత్తగా ఉందంటూ చేసిన ట్రోలింగ్‌తో పెరిగిన కలెక్షన్లు
  • ఓ చిన్న దూడ, ఓ స్కైలార్క్‌ మధ్య సంబంధమే కథ
  • ‘ది ఒడిస్సీ’, ‘స్పైడర్‌ మ్యాన్‌’తో నియు లై పోటీ
చైనాలో ఓ చిన్న యానిమేషన్‌ సినిమా ఇప్పుడు భారీ సినిమాలకు షాకిస్తోంది. కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి, సుమారు రూ.1 లక్ష బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం.. తొలుత ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. గ్రాఫిక్స్‌ బాగోలేవని, పాత్రల కదలికలు విచిత్రంగా ఉన్నాయని, కథ అర్థం కావడం లేదంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు ట్రోల్‌ చేశారు. కానీ అదే ట్రోలింగ్‌ ఇప్పుడు ఆ సినిమాకు భారీ వసూళ్లు తెచ్చిపెడుతోంది.

‘నియు లై’ (Niu Lai) పేరుతో తెరకెక్కిన ఈ 86 నిమిషాల యానిమేషన్‌ మూవీలో ఓ చిన్న దూడ, ఓ స్కైలార్క్‌ మధ్య సంబంధాన్ని కలల తరహా కథనంతో చూపించారు. ఆగస్టు 5న చైనాలో విడుదలైన ఈ సినిమా.. మొదటి పది రోజుల్లో కేవలం 7,700 యువాన్లు అంటే దాదాపు రూ.1.04 లక్షలు మాత్రమే వసూలు చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 300 మంది మాత్రమే టికెట్లు కొనుగోలు చేశారు. సినిమా విడుదలకు ముందు ఎలాంటి ప్రచారం, ప్రమోషన్‌ టూర్‌, కనీసం ట్రైలర్‌ కూడా లేకపోవడం గమనార్హం.

అయితే సినిమా నుంచి కొన్ని క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సినిమా గ్రాఫిక్స్‌, పాత్రల డిజైన్‌, వాయిస్‌ యాక్టింగ్‌, కథనంపై నెటిజన్లు సెటైర్లు వేశారు. కొందరు దీన్ని విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్‌తో పోల్చగా.. మరికొందరు ‘ఏఐ కంటే దారుణంగా ఉంది’, ‘2026లో వచ్చిన చెత్త సినిమాల్లో ఇదొకటి’ అంటూ కామెంట్లు చేశారు. కానీ సినిమా గురించి వచ్చిన ఈ నెగెటివ్‌ ప్రచారమే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

‘నిజంగానే ఇంత చెత్తగా ఉందా?’ అనే ఆసక్తితో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం మొదలుపెట్టారు. దీంతో సినిమా కలెక్షన్లు అనూహ్యంగా పెరిగాయి. చైనా టికెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ మావోయాన్‌ ప్రకారం.. ‘నియు లై’ ఇప్పటివరకు 14.9 మిలియన్‌ యువాన్లకు పైగా వసూలు చేసింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.20 కోట్లకు పైగా. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ది ఒడిస్సీ’, ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’ వంటి సినిమాల మధ్య ఈ చిన్న సినిమా కూడా బాక్సాఫీస్‌ ర్యాంకింగ్స్‌లో నిలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమా విజయం వెనుక మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ‘నియు లై’ని కేవలం ఇద్దరే వ్యక్తులు కలిసి దాదాపు ఐదేళ్లపాటు రూపొందించినట్లు సమాచారం. షిన్‌ యుమెంగ్‌, సన్‌ లిఫాంగ్‌ అనే తల్లీకొడుకులుగా భావిస్తున్న వీరిద్దరూ సినిమాకు రచయితలు, దర్శకులు, నిర్మాతలు, వాయిస్‌ ఆర్టిస్టులుగానూ పనిచేశారు. ఇంత తక్కువ మంది సిబ్బందితో సినిమా పూర్తి చేయడం కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సినిమాకు చేసిన ప్రచారం కూడా చాలా తక్కువే. విడుదలకు ముందు కనిపించిన ఏకైక ప్రకటనగా సంప్రదాయ చైనీస్‌ ఇంక్‌-వాష్‌ శైలిలో రూపొందించిన అందమైన పోస్టర్‌ మాత్రమే ఉంది. పోస్టర్‌ చూస్తే సినిమా ఎంతో నాణ్యంగా ఉంటుందని అనిపించినా.. థియేటర్‌లో కనిపించిన యానిమేషన్‌ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండటంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. సినిమా నాణ్యతపై అనుమానాలున్నప్పటికీ, దర్శకుడితో ఉన్న స్నేహం కారణంగా డిస్ట్రిబ్యూటర్‌ సినిమాను విడుదల చేసినట్లు సమాచారం.

అయితే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను పూర్తిగా బాలేదని అనడం లేదు. కొందరు ప్రేక్షకులు ఏఐతో క్షణాల్లో మెరుగైన విజువల్స్‌ తయారవుతున్న సమయంలో.. ఇలాంటి చేతితో రూపొందించిన, ముడి శైలిలో ఉన్న యానిమేషన్‌ కొత్త అనుభూతిని ఇస్తోందని అంటున్నారు. మరోవైపు పరిశ్రమకు చెందిన కొందరు మాత్రం కథ, విజువల్స్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌.. దాదాపు ప్రతి విషయంలోనూ సినిమా బలహీనంగానే ఉందని అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Niu Lai
Chinese Animation Movie
Low Budget Film
Box Office Success
Xin Yumeng
Viral Movie Trolling

More Telugu News