ఏఐతో పని ఈజీ అనుకున్నారా? సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కష్టాలు ఇవిగో!

Artificial Intelligence impact on software employees and their work struggles
  • ఏఐతో పనిగంటలు తగ్గడం లేదంటున్న నిపుణులు
  • మేనేజ్‌మెంట్‌ అంచనాలు పెరగడంతో కొత్త పనులు వస్తున్నాయని వెల్లడి
  • కొందరు ఉద్యోగులు రోజుకు 16 గంటలు పనిచేస్తున్న వైనం
  • ఉద్యోగులకు సమస్యగా ఏఐ టోకెన్ల పరిమితి
  • ఏఐ ఫలితాలను సరిచేయడం అదనపు పని
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వస్తే ఉద్యోగుల పని సులువవుతుందని, రోజుకు ఎక్కువ గంటలు పనిచేయాల్సిన అవసరం ఉండదని టెక్‌ ప్రపంచంలో చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ కూడా భవిష్యత్తులో వారానికి మూడు రోజులు పనిచేసే పరిస్థితి రావచ్చని గతంలో అన్నారు. అయితే ప్రస్తుతం టెక్‌ రంగంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల అనుభవం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఏఐ వల్ల పని వేగంగా పూర్తవుతున్నా.. కొత్త పనులు పెరగడంతో పనిగంటలు తగ్గడం లేదని వారు చెబుతున్నారు.

బెంగళూరులో పనిచేస్తున్న ఓ సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ ప్రకారం.. ఏఐ వల్ల పని వేగంగా పూర్తవుతోంది. కానీ అదే సమయంలో మేనేజ్‌మెంట్‌ అంచనాలు పెరిగాయి. ఒక పని గతంలో పది గంటలు పట్టేది అయితే.. ఏఐతో ఐదు గంటల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. దీంతో మిగిలిన సమయంలో మరో పని అప్పగిస్తున్నారు. ఫలితంగా ఉద్యోగులకు ఖాళీ సమయం దొరకడం లేదు.

మరో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి గత మూడు నెలలుగా రోజుకు 15 నుంచి 16 గంటలు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఏఐకి సంబంధించిన కొత్త టూల్స్‌, శిక్షణలు, వర్క్‌షాప్‌లకు హాజరవ్వడంతో అదనపు సమయం కూడా వెచ్చించాల్సి వస్తోందన్నారు. ఏఐపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఏఐ టూల్స్‌ వాడకంలో కొన్ని సంస్థలు పరిమితులు విధించడం కూడా సమస్యగా మారింది. ఓ సంస్థ ఉద్యోగులకు నెలకు 250 డాలర్ల విలువైన ఏఐ టోకెన్లు మాత్రమే ఇస్తోంది. నెల మధ్యలోనే ఆ పరిమితి పూర్తవుతోంది. అయినా పనులు వేగంగా పూర్తి చేయాలని మేనేజ్‌మెంట్‌ ఒత్తిడి చేస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు. ఏఐ ఇచ్చిన ఫలితాలు ఎప్పుడూ కచ్చితంగా ఉండవు. వాటిని ఉద్యోగులే సరిచేయాల్సి రావడంతో అదనపు పని చేయాల్సి వస్తోంది.

గ్రాఫిక్‌ డిజైనింగ్‌ వంటి రంగాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏఐ ప్రక్రియను వేగవంతం చేస్తున్నా.. వచ్చిన ఫలితాలను సరిచేయడం, ప్రాంప్ట్‌లను మార్చడం, మాన్యువల్‌గా ఎడిట్‌ చేయడం అవసరమవుతోందని డిజైనర్లు చెబుతున్నారు. కొన్ని ప్రాజెక్టుల్లో మాన్యువల్‌ టెస్టింగ్‌ అవసరం ఉండటంతో ఏఐ వల్ల పెద్దగా మార్పు కనిపించడం లేదని మరికొందరు ఉద్యోగులు తెలిపారు.

అయితే ఏఐని తెలివిగా ఉపయోగిస్తే పనిభారం తగ్గించుకోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏఐ సామర్థ్యం పెరిగే కొద్దీ సంస్థల అంచనాలు కూడా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఓపెన్‌ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌ కూడా భవిష్యత్తులో ఏఐ వల్ల మనుషులు ఊహించిన దానికంటే ఎక్కువ బిజీగా ఉండొచ్చని ఇటీవల వ్యాఖ్యానించారు. అంటే.. ఏఐతో పని తగ్గుతుందన్న ఆశకు బదులు, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయాల్సిన పరిస్థితి రావచ్చన్నమాట.
Advertisement
Artificial Intelligence
Software Employees
Tech Industry
Management Expectations
Workload Challenges
Productivity Tools

More Telugu News