స్కూల్లో గోడ కూలి పదో తరగతి విద్యార్థి మృతి.. స్పందించిన మంత్రి నారా లోకేశ్

10th class student dies as school wall collapses Nara Lokesh responds
  • పార్వతీపురం జిల్లా సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విషాదం
  • గోడ కూలి ఒక విద్యార్థి మృతి.. మరో బాలుడికి తీవ్ర గాయాలు
  • విద్యార్థి మృతి చెందడం కలచివేసిందన్న లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల ప్రహరీ గోడ కూలిపోవడంతో 10వ తరగతి చదువుతున్న తుపాకుల అరుణ్ తేజ (15) అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, సొండి యాకూబ్‌ అనే మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.


మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులిద్దరూ వాలుగా ఉన్న ప్రహరీ గోడపై కూర్చోవడంతో అది ఒక్కసారిగా కుప్పకూలినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన విద్యార్థిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎదిగిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాఠశాల ప్రాంగణంలోనే మృతదేహంతో ధర్నాకు దిగారు. ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థి మరణించడం కలచివేసిందని, గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అరుణ్ తేజ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Advertisement
Arun Teja
Nara Lokesh
Salur school wall collapse
Parvathipuram Manyam district
Andhra Pradesh school accident
Government High School Salur

More Telugu News