ఇల్లు, పిల్లల చదువుకే రూ.7 లక్షలు.. చైనాలో భారతీయ కుటుంబం ఖర్చు వైరల్‌!

7 lakhs for house and kids education Indian family expenses in China viral
  • షాంఘైలో నెలకు రూ.9.81 లక్షల ఖర్చు
  • ఇంటి అద్దెకే నెలకు రూ.3.5 లక్షలు
  • పిల్లల స్కూల్‌ ఫీజు రూ.3.5 లక్షలు
  • కిరాణాకు నెలకు రూ.70,750 ఖర్చు
  • ఇంటి పనివాళ్లకు రూ.లక్షకుపైగా చెల్లిస్తున్న వైనం
చైనాలో జీవితం అంటే తక్కువ ఖర్చుతోనే సాగిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ షాంఘైలో ఉంటున్న ఓ భారతీయ కుటుంబం నెలవారీ ఖర్చులు మాత్రం అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. నలుగురు సభ్యులున్న ఆ కుటుంబం నెలకు దాదాపు రూ.9.81 లక్షలు ఖర్చు చేస్తోంది. అద్దె, పిల్లల చదువు, కిరాణా, ఇంటి పనివాళ్లు, వినోదం ఇలా పలు ఖర్చులను ఆ కుటుంబానికి చెందిన అదితి శర్మ సోషల్‌ మీడియాలో వివరించారు.

అదితి శర్మ కుటుంబం షాంఘైలోని ఇంటి అద్దెకు నెలకు 25,000 యువాన్లు చెల్లిస్తోంది. మన కరెన్సీలో ఇది దాదాపు రూ.3.5 లక్షలు. పిల్లలు అంతర్జాతీయ పాఠశాలలో చదువుతున్నారు. వారి చదువుకు కూడా నెలకు మరో 25,000 యువాన్లు, అంటే సుమారు రూ.3.5 లక్షలు ఖర్చవుతున్నాయి. కుటుంబం నెలవారీ బడ్జెట్‌లో ఎక్కువ భాగం ఈ రెండు ఖర్చులకే వెళ్తోంది.

కిరాణా సరుకులకు నెలకు దాదాపు 5,000 యువాన్లు ఖర్చవుతున్నాయి. అంటే సుమారు రూ.70,750. ఇంటి పనుల కోసం పెట్టుకున్న సిబ్బందికి నెలకు రూ.లక్షకుపైగా చెల్లిస్తున్నారు. విద్యుత్‌, నీరు, ఇతర యుటిలిటీ ఖర్చులకు సుమారు రూ.21,230 వెచ్చిస్తున్నారు. ప్రజా రవాణాకు మరో రూ.10 వేల వరకు ఖర్చవుతోంది.

పిల్లల వినోదం, అదనపు కార్యక్రమాల కోసం నెలకు మరో 1,500 యువాన్లు ఖర్చు చేస్తున్నారు. బయట తినడం, షాపింగ్‌కు సుమారు 4,000 యువాన్లు, అంటే రూ.56,650 వరకు వెచ్చిస్తున్నారు. ఇలా అన్ని ఖర్చులు కలిపితే నెలకు దాదాపు రూ.9,81,860 అవుతున్నాయని అదితి తెలిపారు.

అయితే ఈ మొత్తాన్ని షాంఘైలో ప్రతి కుటుంబానికి వర్తించే ఖర్చుగా చూడొద్దని ఆమె స్పష్టం చేశారు. తమ జీవనశైలి, పిల్లలు చదివే స్కూల్‌, ఉండే ప్రాంతం, ఇంటి అద్దె ఆధారంగా ఖర్చులు మారుతాయని చెప్పారు. తమకు ఎలాంటి ప్రవాస భత్యం రావడం లేదని, వైద్య బీమా మాత్రం 100 శాతం వైద్య ఖర్చులను కవర్‌ చేస్తుందని తెలిపారు.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పలువురు స్పందించారు. షాంఘై, బీజింగ్‌ వంటి పెద్ద నగరాల్లో అద్దెలు, అంతర్జాతీయ పాఠశాలల ఫీజులు భారీగా ఉంటాయని కొందరు పేర్కొన్నారు. చైనాలోని చిన్న నగరాలతో పోలిస్తే ఈ నగరాల్లో జీవన వ్యయం చాలా ఎక్కువగా ఉంటుందని మరికొందరు తెలిపారు.
Advertisement
Aditi Sharma
Shanghai cost of living
Indian family in China
Shanghai international school fees
Monthly expenses in Shanghai
Viral social media video

More Telugu News