మండలిలో 'డీఎస్సీ' రగడ.. బొత్సకు అచ్చెన్నాయుడు కౌంటర్

Atchannaidu counters Botsa Satyanarayana over Mega DSC row in AP Council
  • డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్న అచ్చెన్నాయుడు
  • మెగా డీఎస్సీ-2025లో అవకతవకలపై సీబీఐ విచారణకు విపక్షం డిమాండ్
  • విద్యాశాఖ మంత్రిగా బొత్స విఫలమయ్యారంటూ అచ్చెన్న విమర్శలు
  • అచ్చెన్న వ్యాఖ్యలపై దుమారం, క్షమాపణ చెప్పాలని విపక్షం పట్టు
  • గందరగోళం మధ్య శాసనమండలి రెండు సార్లు వాయిదా
గత ఐదేళ్ల పాలనలో నిరుద్యోగులకు 'మెగా డీఎస్సీ' ఇస్తామని ఆశలు రేపి, చివరికి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మోసం చేసిన వైసీపీకి ఇప్పుడు డీఎస్సీ నియామకాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ, నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుని ఇప్పుడు మండలిలో డీఎస్సీపై నీతులు చెప్పడం సిగ్గుచేటని ఆయన ఘాటుగా విమర్శించారు.

సోమవారం ప్రారంభమైన ఏపీ శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజే శాసనమండలి 'మెగా డీఎస్సీ-2025' అంశంతో దద్దరిల్లింది. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అయితే, మండలి చైర్మన్ కె. మోషేను రాజు వాయిదా తీర్మానాన్ని తిరస్కరించి, ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ అంశంపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

చైర్మన్ నిర్ణయంతో ఏకీభవించని వైసీపీ సభ్యులు, సభా కార్యకలాపాలను అడ్డుకుంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. డీఎస్సీ పేరుతో మూడు లక్షల మంది నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని, క్రీడల కోటాలో తమకు నచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై సభలో చర్చ జరగాలని పట్టుబట్టారు.

బొత్స ఆరోపణలపై అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. "గత ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వని మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారా? అధికారంలో ఉన్నప్పుడు చేతకాక, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక మండలిలో ప్రశ్నలు వేయడం రాజకీయ ద్వంద్వ నీతి కాదా?" అని బొత్సను నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు సకాలంలో ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అయితే, దీన్ని అడ్డుకునేందుకు వైసీపీ ఏకంగా 300 కోర్టు కేసులు వేసిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

ఈ క్రమంలో బొత్స సత్యనారాయణను ఉద్దేశించి అచ్చెన్నాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. దీంతో వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. గందరగోళం నడుమ చైర్మన్ సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత, అచ్చెన్నాయుడు తన అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బొత్స డిమాండ్ చేశారు. దీనికి మంత్రి స్పందిస్తూ, తాను వాడిన పదాలు అన్‌పార్లమెంటరీ కావని, ఒకవేళ చైర్మన్ రూలింగ్ ఇస్తే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయినప్పటికీ వైసీపీ సభ్యులు నిరసన కొనసాగించడంతో, చైర్మన్ సభను రెండోసారి వాయిదా వేశారు.
Advertisement
Atchannaidu
Mega DSC 2025
Botsa Satyanarayana
Andhra Pradesh Legislative Council
Teacher Recruitment
Nara Lokesh

More Telugu News