ఏపీ అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం
- బీజేపీ కండువా వేసుకుని సభలోకి వచ్చిన సత్యకుమార్
- సత్యగారు.. మీరు బీజేపీ అని లోకమంతా తెలుసు కదా అన్న లోకేశ్
- నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్ అన్న సత్యకుమార్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా, మంత్రుల మధ్య చోటుచేసుకున్న ఓ సరదా సంభాషణ సభలో నవ్వులు పూయించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన పార్టీ కండువా వేసుకుని శాసనసభలోకి రాగా, దానిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తనదైన శైలిలో చమత్కరించారు.
"సత్యగారూ.. మీకెందుకండి ప్రత్యేకంగా పార్టీ కండువా? మీరు బీజేపీ అని లోకమంతా తెలుసు కదా" అని లోకేశ్ సరదాగా అనడంతో, సీనియర్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా జతకలిశారు. "అవును సర్.. జాతీయ స్థాయిలో ప్రముఖ నేతల్లో సత్యగారు కూడా ఒకరు" అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడంతో అక్కడి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది.
ఆ తర్వాత లోకేశ్ మరో అడుగు ముందుకేసి.. "మా పార్టీ వారికి కూడా కొంచెం క్రమశిక్షణ గురించి నేర్పించండి" అని నవ్వుతూ సత్యకుమార్‌ను కోరారు. దీనిపై పక్కనే ఉన్న ఓ టీడీపీ ఎమ్మెల్యే "పార్టీ ఫస్ట్, సర్!" అని స్పందించగా.. వెంటనే సత్యకుమార్ యాదవ్ చిరునవ్వుతో "నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్.. సెల్ఫ్ లాస్ట్!" అంటూ ఇచ్చిన రిప్లై మంత్రులు, ఎమ్మెల్యేలను ఎంతగానో ఆకట్టుకుంది. విధానపరమైన చర్చలతో సీరియస్‌గా సాగే అసెంబ్లీలో ఈ సరదా సంభాషణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.