పోలీస్ డాగ్స్ విన్యాసాలు చూసి ముగ్ధులైన పవన్, అన్నా కొణిదెల.. వీడియో ఇదిగో!

Pawan Kalyan and Anna Konidela mesmerized by police dog stunts here is the video
  • కాకినాడలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
  • ఆకట్టుకున్న జాగిలాల విన్యాసాలు
  • వీడియో తీసిన అన్నా కొణిదెల
  • పవన్‌కు పుష్పగుచ్ఛం అందించిన రాక్సీ
  • లగేజీని గుర్తించిన మ్యాక్సీ
కాకినాడలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పోలీసు జాగిలాల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జాగిలాల బృందం చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పవన్‌ అర్ధాంగి అన్నా కొణిదెల వాటిని ఆసక్తిగా వీక్షించారు. తన ఫోన్‌లో జాగిలాల విన్యాసాలను చిత్రీకరిస్తూ ఉత్సాహంగా కనిపించారు.

విన్యాసాల్లో భాగంగా రాక్సీ అనే జాగిలం పవన్‌ కల్యాణ్‌ వద్దకు పుష్పగుచ్ఛంతో వచ్చింది. దాన్ని ఆయనకు అందించి సెల్యూట్‌ చేయడంతో ఆయన చిరునవ్వులు చిందిస్తూ గౌరవాన్ని స్వీకరించారు. అనంతరం మరో మూడు జాగిలాలు కలిసి పవన్‌కు ప్రత్యేక గౌరవ వందనం సమర్పించాయి. ఈ దృశ్యాలు కార్యక్రమానికి హాజరైన వారిని ఆకట్టుకున్నాయి.

ఆ తర్వాత జాగిలాల సామర్థ్యాన్ని పరీక్షించేలా కొన్ని సూట్‌కేసులను అక్కడ ఉంచారు. వాటిలో లగేజీ ఉన్న సూట్‌కేసులను గుర్తించమని సూచించగా.. లైకా అనే జాగిలం క్షణాల్లో సరైన వాటిని పసిగట్టింది. మరోవైపు రాక్సీ కూడా వాసన ఆధారంగా వస్తువులను గుర్తించింది. ఓ జాగిలం వివిధ దేశాల చిత్రపటాలను వాసన చూస్తూ, భారతదేశ చిత్రపటాన్ని గుర్తుపట్టి అక్కడే కూర్చోవడం అందరినీ అలరించింది. జాగిలాలు తమ శిక్షణకు తగ్గట్టుగా వరుసగా విన్యాసాలు చేయడంతో పవన్‌ సహా అక్కడున్న వారంతా ఆసక్తిగా వీక్షించారు. ముఖ్యంగా అన్నా కొణిదెల వాటిని ఫోన్‌లో బంధించిన దృశ్యాలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్నాయి.
Advertisement
Pawan Kalyan
Anna Konidela
Kakinada
Police Dog Show
Independence Day
Andhra Pradesh

More Telugu News