రాష్ట్రంలో బ్రిటీష్ పాలనను తలపించేలా పక్షపాత వైఖరి.. ప్రశ్నిస్తే కేసులా?: స్వాతంత్ర్య వేడుకల్లో బొత్స
- తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- జాతీయ జెండాను ఆవిష్కరించిన బొత్స సత్యనారాయణ
- పేదలకు విద్య, వైద్యం యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శ
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
జెండా ఆవిష్కరణ అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రస్తుత పాలనా తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలనలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదని, కానీ దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ‘మనవాడా.. కాదా’ అని చూసి సంక్షేమ పథకాలను అందించే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులపై కేసులు పెడుతున్న తీరు మళ్లీ బ్రిటీష్ పాలనను తలపిస్తోందని, మన పూర్వికులు ప్రాణాలర్పించి తెచ్చిన స్వాతంత్ర్య స్ఫూర్తి ఇదేనా అని నిలదీశారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల వైపు కాకుండా ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు.
ఓటు వేసినా, వేయకపోయినా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే నిజమైన పరిపాలన అని బొత్స స్పష్టం చేశారు. జగన్ హయాంలో విద్య, వైద్యం, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పేదరికం లేని సమాజ స్థాపన కోసం పాలన సాగిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే అని భావిస్తోందని... పేదలకు విద్య, వైద్యం అందించడంలో, యువతకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.