అమరావతిలో పండుగ వాతావరణం.. నేడు సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించనున్న చంద్రబాబు

Chandrababu Naidu to inaugurate Amaravati Seed Access Road today
  • రెండు స్టీల్ బ్రిడ్జిలతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల అప్పగింత
  • 21 కిలోమీటర్ల పొడవుతో 9 లేన్ల రహదారిగా నిర్మాణం
  • రాజధానిలోని ప్రధాన రహదారులు జాతీయ రహదారితో అనుసంధానం
  • ప్రభుత్వ భవనాలు అందుబాటులోకి రావడంతో రాజధానిలో పండుగ వాతావరణం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాజధానికి జీవనాడి లాంటి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు (గురువారం) ఈ రహదారిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాజధాని అభివృద్ధిలో ఈ రహదారి అత్యంత కీలకం కానుండటంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం ఏర్పడింది.

ఈ రోడ్డు ప్రారంభోత్సవంతో పాటు, రాజధానిలో నిర్మించిన రెండు స్టీల్ బ్రిడ్జిలను కూడా సీఎం ప్రారంభిస్తారు. అనంతరం ఇదే మార్గంలో రాయపూడి వరకు ప్రయాణించి, అక్కడ సిద్ధమైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల తాళాలను అందుకుని, వాటిని సాధారణ పరిపాలన విభాగానికి (జీఏడీ) అప్పగిస్తారు. ఒకే రోజు మూడు కీలక కార్యక్రమాలు జరగనుండటం, ప్రభుత్వ భవనాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తుండటంతో రాజధాని గ్రామాల్లో సందడి నెలకొంది.

అమరావతి రోడ్ల అనుసంధానంలో సీడ్ యాక్సెస్ రోడ్డు అత్యంత కీలకం కానుంది. మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవుతో 9 లేన్ల రహదారిగా దీన్ని నిర్మిస్తున్నారు. మధ్యలో బీఆర్టీఎస్ కారిడార్, ఇరువైపులా 11 మీటర్ల వెడల్పుతో సర్వీస్ రోడ్లు కూడా ఉంటాయి. రాజధానిలోని ఉత్తరం-దక్షిణం వైపు వెళ్లే N1 నుంచి N17 వరకు ఉన్న రోడ్లన్నీ ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానం అవుతాయి.

ఈ రోడ్డును మూడు దశల్లో నిర్మిస్తున్నారు. మొదటి దశలో దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు పనులు చేపట్టారు. రెండో దశలోనే ఉండవల్లి వద్ద బకింగ్‌హామ్ కాలువపై 110 మీటర్ల స్టీల్ బ్రిడ్జి, కొండవీటి వాగుపై 280 మీటర్ల స్టీల్ బ్రిడ్జి నిర్మాణాలను పూర్తి చేశారు. ఈ రహదారి దొండపాడు నుంచి తాడేపల్లి వద్ద జాతీయ రహదారి-16ను కలుపుతూ రాజధాని ప్రగతికి రాచబాట వేయనుంది.
Advertisement
Chandrababu Naidu
Amaravati Seed Access Road
Andhra Pradesh Capital Development
Amaravati Steel Bridges
Rayapudi MLA MLC Quarters
Amaravati Infrastructure News

More Telugu News