నా హత్యకు ఇరాన్ కుట్ర.. అందుకే తుర్కియేలో రహస్యంగా విమానం మారాను: ట్రంప్

Donald Trump reveals Iran assassination plot and secret plane switch in Turkey
  • తుర్కియేలో తనపై ఇరాన్ హత్యాప్రయత్నానికి కుట్ర చేసిందని ధ్రువీకరించిన ట్రంప్ 
  • అందుకే 'నాటో' సదస్సు తర్వాత రహస్యంగా తన విమానాన్ని మార్చినట్లు వెల్లడి
  • విమానాశ్రయంలో క్యాటరింగ్ ట్రక్కులో ప్రయాణించి మరో సైనిక విమానంలో వెళ్లిన వైనం
  • అసలు విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌ను జర్నలిస్టులతో అలాగే పంపి మభ్యపెట్టామ‌ని వ్యాఖ్య‌
  • ప్రభావశీల అధ్యక్షులకు ఇలాంటి బెదిరింపులు సాధారణమేనన్న‌ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భద్రతకు సంబంధించి ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. తుర్కియేలో జరిగిన 'నాటో' సదస్సు అనంతరం, ఇరాన్ నుంచి వచ్చిన హత్యా బెదిరింపు కారణంగా తాను రహస్యంగా విమానం మారాల్సి వచ్చిందని ధ్రువీకరించారు. అమెరికా సీక్రెట్ సర్వీస్, సైన్యం సూచనల మేరకు తాను నడుచుకున్నానని, ఆ ముప్పు గురించి తాను పెద్దగా వివరాలు అడగలేదని తెలిపారు.

ఈ ఏడాది జులైలో అంకారాలో జరిగిన 'నాటో' సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు. సదస్సు ముగిశాక తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనం ప్రకారం.. ట్రంప్‌ను ఒక చిన్న అమెరికా సైనిక విమానంలో రహస్యంగా తరలించారు. ఆయన ప్రయాణించాల్సిన అధికారిక విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్' ను ఆయన అందులోనే ఉన్నట్లు మభ్యపెట్టేందుకు డెకాయ్‌గా ఉపయోగించారు. విమానాశ్రయంలో ఒక విమానం నుంచి మరొకదానికి మారేందుకు ట్రంప్‌ను ఒక క్యాటరింగ్ ట్రక్కులో తరలించడం గమనార్హం.

ఈ విమానం మార్పుపై ట్రంప్ స్పందిస్తూ.. "సీక్రెట్ సర్వీస్, సైన్యం చెప్పినట్లే నేను నడుచుకుంటాను. వారు నన్ను వేరే విమానంలో వెళ్లాలని కోరారు.. నేను వాళ్లు చెప్పింది చేశాను. బయట ఏదో ముప్పు ఉందని భావిస్తున్నాను. దాని గురించి ఎక్కువగా అడగలేదు. నాకు చాలా బెదిరింపులు వస్తుంటాయి" అని అన్నారు. అయితే, తాను రహస్యంగా ప్రయాణించిన సైనిక విమానానికే ఎక్కువ ప్రమాదం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. శత్రువులు దాడి చేయాలనుకుంటే బహుశా ఆ విమానాన్నే లక్ష్యంగా చేసుకునేవారని వ్యాఖ్యానించారు.

అమెరికా అధ్యక్షుడికి ఇలాంటి బెదిరింపులు రావడం అసాధారణం కాదని చెబుతూ ట్రంప్ ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నారు. "మీకు తెలియని ఎన్నో బెదిరింపులు నాకు ఉన్నాయి. ప్రభావశీలురైన అధ్యక్షులకు చాలా ముప్పులు పొంచి ఉంటాయి. ప్రాధాన్యత లేని అధ్యక్షులను ఎవరూ బెదిరించరు. బహుశా నేనే అత్యంత ప్రభావశీల అధ్యక్షుడిని అనుకుంటున్నాను" అని అన్నారు. భద్రతాపరమైన రిస్క్‌ల గురించి తాను ఆందోళన చెందనని చెప్పిన ట్రంప్‌.. "ఏదైనా సరే, నా వైఖరి మీకు తెలుసు కదా? ఏదైతే అది అవుతుంది" అంటూ వ్యాఖ్యానించారు.

అసలేం జరిగింది?
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బెదిరింపు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని, ముఖ్యంగా ఆయన విమానంపై దాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. దీంతో సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమైంది. ట్రంప్ వచ్చిన విమానంలో తిరుగు ప్రయాణం సురక్షితం కాదని నిర్ణయించి, ఆయన్ను ఎయిర్ ఫోర్స్ సీ-32ఏ అనే చిన్న సైనిక విమానంలోకి మార్చారు.

ఈ ఆపరేషన్ మొత్తాన్ని అత్యంత రహస్యంగా నిర్వహించారు. ట్రంప్ అసలు విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌లోనే ఉన్నారని భావించిన జర్నలిస్టులు, కొందరు వైట్‌హౌస్ సిబ్బంది అందులోనే ప్రయాణించారు. ట్రంప్ వేరే విమానంలో వెళ్లిపోయిన విషయం వారికి తెలియదు. అయితే, అధ్యక్షుడిని రక్షించే క్రమంలో ముప్పు గురించి తెలియజేయకుండా జర్నలిస్టులు, సిబ్బందిని డెకాయ్ విమానంలో ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఆందోళనలను పక్కనపెట్టిన ట్రంప్, తన ప్రయాణాన్ని ఎలా నిర్ణయించాలనే విషయంలో సీక్రెట్ సర్వీస్, సైన్యంపై తనకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు.
Advertisement
Donald Trump
Iran assassination plot
NATO summit Turkey
Air Force One decoy
US Secret Service
Ankara security threat

More Telugu News