పదేళ్ల ప్రేమకు శుభం కార్డు.. ప్రేయసిని పెళ్లాడిన రొనాల్డో.. ఐదుగురు పిల్లల సమక్షంలో ఏడడుగులు

Cristiano Ronaldo marries Georgina Rodriguez after ten years of love in secret ceremony
  • ప్రేయసి జార్జినా రోడ్రిగ్జ్‌ను పెళ్లి చేసుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో
  • పోర్చుగల్‌లో కుటుంబ సభ్యుల మధ్య రహస్యంగా వివాహం
  • సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేసి పెళ్లి విషయం వెల్లడి
  • పదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంటకు ఐదుగురు పిల్లలు
  • 2016లో మాడ్రిడ్‌లోని ఓ గూచీ స్టోర్‌లో తొలిసారి కలిసిన‌ వీరిద్దరూ
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ ఐకాన్ క్రిస్టియానో రొనాల్డో తన అభిమానులను మరోసారి ఆశ్చర్యపరిచాడు. ఈసారి మైదానంలో కాదు, తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఓ కీలక నిర్ణయంతో అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. తన చిరకాల ప్రేయసి జార్జినా రోడ్రిగ్జ్‌ను ఆగస్టు 11న రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని రొనాల్డో స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో ఇంటర్నెట్‌లో ఈ వార్త క్షణాల్లో వైరల్‌గా మారింది. జార్జినాతో కలిసి పెళ్లి ఉంగరాలు చూపిస్తూ దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. "C(హార్ట్ ఎమోజీ)G" అనే చిన్న క్యాప్షన్‌తో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించాడు.

పోర్చుగల్ రాజధాని లిస్బన్‌కు సమీపంలోని తీరప్రాంత పట్టణమైన కాస్కాయిస్‌లో ఈ వివాహ వేడుక అత్యంత నిరాడంబరంగా, గోప్యంగా జరిగింది. కేవలం వారి ఐదుగురు పిల్లలు క్రిస్టియానో జూనియర్, కవలలు ఇవా-మాటియో, అలనా మార్టినా, బెల్లా ఎస్మరాల్డాల సమక్షంలోనే ఈ జంట ఒక్కటైనట్లు బ్రన్స్‌విక్ గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది. పదేళ్లుగా కొనసాగుతున్న వీరి ప్రేమ ప్రయాణం పెళ్లి బంధంతో కొత్త మలుపు తీసుకుంది.

వీరిద్దరి ప్రేమకథ 2016లో స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో మొదలైంది. అప్పట్లో రొనాల్డో రియల్ మాడ్రిడ్ క్లబ్‌కు ఆడుతుండగా, జార్జినా ఓ గూచీ బొటిక్‌లో సేల్స్ అసిస్టెంట్‌గా పనిచేసేది. అక్కడ తొలిసారి కలుసుకున్న వారిద్దరూ, కొద్దిరోజుల తర్వాత ఓ బ్రాండ్ ఈవెంట్‌లో మళ్లీ కలుసుకున్నారు. అప్పటి నుంచి వారి మధ్య ప్రేమ చిగురించి, బలమైన బంధంగా మారింది. 2017లో జార్జినా వారి కుమార్తె అలనా మార్టినాకు జన్మనిచ్చింది. అంతకుముందే సరోగసీ ద్వారా జన్మించిన రొనాల్డో కవల పిల్లలు ఇవా, మాటియోలను కూడా జార్జినా తన సొంత బిడ్డల్లా పెంచుకుంది.

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో పోర్చుగల్ తరఫున 146 గోల్స్‌తో రికార్డు సృష్టించిన రొనాల్డో, ఐదుసార్లు ప్రతిష్ఠాత్మక బాలన్ డి'ఓర్ అవార్డును గెలుచుకున్నాడు. ప్రస్తుతం సౌదీ ప్రో లీగ్‌లో అల్ నాసర్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శనివారం నుంచి ప్రారంభం కానున్న దేశీయ సీజన్‌లో రొనాల్డో బరిలోకి దిగనున్నాడు.
Advertisement
Cristiano Ronaldo
Georgina Rodriguez
Cristiano Ronaldo Wedding
Portugal Football
Al Nassr FC
Georgina Rodriguez Marriage

More Telugu News