ఆంక్షలు విధించడం అమెరికాకు వ్యసనంగా మారింది: ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్ర వ్యాఖ్యలు

Esmaeil Baghaei says imposing sanctions has become an addiction for America
  • అమెరికా ఆర్థికమంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ ఇరాన్
  • లక్ష్యాలను సాధించడంలో విఫలమైనప్పుడల్లా ఆంక్షల అస్త్రాలను ప్రయోగిస్తోందని మండిపాటు
  • ఆంక్షల బెదిరింపులతో తమను లొంగదీసుకోలేరని వ్యాఖ్య

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై, ముఖ్యంగా తమ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించడం అమెరికాకు ఒక అలవాటుగా, చివరకు వ్యసనంగా మారిపోయిందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంక్షల ద్వారా ఇరాన్‌ను ‘ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాం’ అంటూ అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలపై ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఘాటుగా స్పందించారు. దౌత్య మార్గాల్లో అనుకున్న లక్ష్యాలను సాధించడంలో విఫలమైనప్పుడల్లా అమెరికా ఈ ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగిస్తోందని, అవి పనిచేయనప్పుడు మరింత తీవ్రతను పెంచుతూ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.


దశాబ్దాలుగా ఇరాన్ ప్రజలు అమెరికా విధించిన కఠినమైన ఆంక్షలను తట్టుకుని నిలబడ్డారని, కేవలం ఆంక్షల బెదిరింపులతో తమ దేశాన్ని లొంగదీసుకోవడం ఎవరికీ సాధ్యం కాదని బఘాయీ స్పష్టం చేశారు. అమెరికా నాయకులు ఈ విపరీత ధోరణిని, చెడు అలవాటును ఇలాగే కొనసాగిస్తే, భవిష్యత్తులో దౌత్యపరమైన సంక్షోభాల నుంచి గౌరవప్రదంగా బయటపడే అవకాశాలను వారే స్వయంగా నాశనం చేసుకుంటారని హెచ్చరించారు.


మరోవైపు, ఇరాన్ ప్రభుత్వం ఆంక్షలను అధిగమించడానికి డిజిటల్ ఆస్తులు, రహస్య బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లపై ఆధారపడుతోందని అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ ఆరోపించారు. ఇరాన్ కొనసాగిస్తున్న అక్రమ ఆర్థిక వ్యవస్థలను గుర్తించి త్వరలోనే పూర్తిగా ధ్వంసం చేస్తామని వెల్లడించారు.


ఇంకోవైపు, అమెరికాతో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ ఇరాన్ సైనిక నాయకత్వంలో కీలక నియామకాలు జరిగాయి. దేశ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ తొలిసారిగా మిలిటరీ విభాగంలో ప్రధాన మార్పులు చేశారు. సాయుధ దళాల చీఫ్‌గా మేజర్ జనరల్ అలీ అబ్దొల్లాహీని, డిప్యూటీ చీఫ్‌గా కియుమర్స్ హైదరీని నియమించారు. అలాగే శక్తివంతమైన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్‌గా మేజర్ జనరల్ అహ్మద్ వాహిదీని, ఆయన డిప్యూటీగా మోస్తఫా ఇజాదీని బాధ్యతల్లోకి తీసుకువచ్చారు. మొజ్తబా ఖమేనీ నాయకత్వంలో జరిగిన ఈ అత్యున్నత స్థాయి నియామకాలు ప్రాంతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Advertisement
Esmaeil Baghaei
US Iran Sanctions
Scott Bessent
Mojtaba Khamenei
Iran Military Appointments
IRGC Commanders

More Telugu News