యూట్యూబ్‌లో డబ్బు సంపాదించాలా?.. ఇకపై ఈ రూల్స్ తప్పనిసరి!

YouTube Monetization Rules Mandatory For Creators To Earn Money
  • మానిటైజేషన్ నిబంధనలను కఠినతరం చేసిన యూట్యూబ్
  • వ‌చ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త మార్పులు
  • ఇకపై 8,000 వాచ్ అవర్స్ లేదా 20 మిలియన్ షార్ట్స్ వ్యూస్ తప్పనిసరి
  • ప్రస్తుతం పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉన్నవారిపై ప్రభావం ఉండదు
  • 'ప్రీమియం లైట్' సబ్‌స్క్రిప్షన్‌ను కూడా విస్తరిస్తున్నట్లు ప్రకటన
యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తూ డబ్బు సంపాదించాలనుకునే వారికి ఆ సంస్థ కీలక అప్‌డేట్ ఇచ్చింది. మానిటైజేషన్ కోసం అవసరమైన అర్హత ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కొత్తగా క్రియేటర్లుగా మారాలనుకునే వారు ఆదాయం పొందాలంటే మరింత పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని యూట్యూబ్ స్పష్టం చేసింది.

కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై ఒక ఛానెల్ మానిటైజ్ కావాలంటే ఏడాది కాలంలో కనీసం 8,000 గంటల వ్యూస్ (watch hours) లేదా గత 90 రోజుల్లో 20 మిలియన్ల క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ సాధించి ఉండాలి. ప్రస్తుతం ఈ నిబంధన 4,000 గంటల వ్యూస్ లేదా 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్‌గా ఉంది. అయితే, ఇప్పటికే యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌ (వైపీపీ)లో భాగస్వాములుగా ఉన్న క్రియేటర్లపై ఈ కొత్త మార్పుల ప్రభావం ఉండదని కంపెనీ హామీ ఇచ్చింది. కొత్తగా ప్రోగ్రామ్‌లో చేరాలనుకునే వారికి మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి.

ప్లాట్‌ఫామ్ వృద్ధికి అనుగుణంగా ఈ మార్పులు చేస్తున్నట్లు యూట్యూబ్ తన ప్రకటనలో వివరించింది. ప్రస్తుతం తమ ప్లాట్‌ఫామ్‌పై రోజూ 200 బిలియన్లకు పైగా షార్ట్స్ వ్యూస్, టీవీల్లో వంద కోట్ల గంటలకు పైగా వాచ్ టైమ్ నమోదవుతున్నట్లు పేర్కొంది. పెరిగిన పోటీ నేపథ్యంలో నాణ్యమైన కంటెంట్‌ను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. షార్ట్స్ క్రియేటర్ ఫూల్ ద్వారా ఆదాయం పొందాలంటే, ప్రతి 90 రోజుల వ్యవధిలో 10 మిలియన్ల వ్యూస్‌ను నిలబెట్టుకోవాలని కూడా యూట్యూబ్ స్పష్టం చేసింది.

మరోవైపు యూట్యూబ్ తన 'ప్రీమియం లైట్' సబ్‌స్క్రిప్షన్‌ను కూడా మరిన్ని దేశాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సబ్‌స్క్రిప్షన్ ద్వారా వచ్చే ఆదాయంలో లాంగ్-ఫామ్ వీడియో క్రియేటర్లకు 55శాతం, షార్ట్స్ క్రియేటర్లకు 45 శాతం వాటా లభిస్తుందని తెలిపింది. యూట్యూబ్‌తో పాటు 'ఎక్స్‌' (ట్విట్టర్), ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లు కూడా క్రియేటర్ల కోసం తమ మానిటైజేషన్ ప్రోగ్రామ్‌లను సవరిస్తున్నాయి. దీంతో కంటెంట్ క్రియేషన్ ద్వారా ఆదాయం పొందాలంటే, స్థిరమైన, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను సంపాదించుకోవడం అత్యంత ఆవశ్యకంగా మారింది.
Advertisement
YouTube
YouTube Monetization Rules
YouTube Partner Program
Content Creator Earnings
YouTube Shorts Views
YouTube Watch Hours

More Telugu News