రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ షో.. 2027 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఆఫ్ఘనిస్థాన్

Rashid Khan all round show Afghanistan qualifies for 2027 World Cup
  • రెండో వన్డేలో ఐర్లాండ్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం
  • బంతితో, బ్యాట్‌తో రాణించి విజయాన్ని అందించిన కెప్టెన్ రషీద్ ఖాన్
  • ఐర్లాండ్ బౌలర్ గేవిన్ హోయ్ 4 వికెట్లతో పోరాడినా ఫలితం శూన్యం
  • ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచిన ఆఫ్ఘనిస్థాన్
ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు 2027 వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఐర్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన రెండో వన్డేలో 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఈ ఘనతను అందుకుంది. కెప్టెన్ రషీద్ ఖాన్ బంతితో, బ్యాట్‌తో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఫ్ఘనిస్థాన్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికా దేశాల్లో జరిగే ప్రపంచకప్ టోర్నమెంట్‌లో వరుసగా నాలుగోసారి తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 47 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 128 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, తొమ్మిదో వికెట్‌కు గేవిన్ హోయ్ (36), జై మూంద్రా (31) రికార్డు స్థాయిలో 76 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్‌కు ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (71) అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. అయితే, ఐర్లాండ్ యువ లెగ్ స్పిన్నర్ గేవిన్ హోయ్ (4/34)  అద్భుతమైన బౌలింగ్‌తో ఆఫ్ఘనిస్థాన్‌ను దెబ్బతీశాడు. మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు పడటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ రషీద్ ఖాన్ (37 నాటౌట్) ఒత్తిడికి తలొగ్గకుండా నిలబడ్డాడు. కీలకమైన ఇన్నింగ్స్ ఆడి మరో 5 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆఫ్ఘన్ శిబిరంలో సంబరాలు మిన్నంటాయి.
Advertisement
Rashid Khan
Afghanistan Cricket Team
2027 ODI World Cup
Afghanistan Ireland ODI
Rahmanullah Gurbaz
World Cup Qualification

More Telugu News