మంచి కథలతో రండి.. అవకాశమిస్తాం: కొత్త దర్శకులకు అక్కినేని నాగార్జున బంపర్ ఆఫర్
- స్టూడియో అంటే కేవలం డబ్బులు సంపాదించడం మాత్రమే కాదన్న నాగార్జున
- సినీ రంగానికి తిరిగి సేవ చేయాలనేది తన అభిమతమని వెల్లడి
- మంచి కథ ఉన్నవారు నేరుగా అన్నపూర్ణ స్టూడియోను సంప్రదించవచ్చన్న నాగార్జున
మంచి కథలతో వచ్చే కొత్తవారికి అవకాశాలు ఇచ్చి సినిమాలు నిర్మించేందుకు తమ అన్నపూర్ణ స్టూడియోస్ సిద్ధంగా ఉందంటూ టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున అదిరిపోయే ప్రకటన చేశారు. ‘పళ్ళ బురుసు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... మంచి కథ ఉన్నవారు ఎవరైనా సరే నేరుగా అన్నపూర్ణ స్టూడియోను సంప్రదించవచ్చని పిలుపునిచ్చారు. స్టూడియో అంటే కేవలం లీజుకు ఇచ్చి డబ్బులు సంపాదించడం మాత్రమే కాదని, తిరిగి సినీ రంగానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే కొత్త దర్శకులతో చిత్రాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల ‘లెనిన్’ సినిమాతో మంచి విజయాన్ని సాధించామని, ఇప్పుడు ‘పళ్ళ బురుసు’ నిర్మించి రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ‘రంభ, ఊర్వశి, మేనక’తో పాటు తన ప్రతిష్ఠాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రాబోతున్నట్లు నాగార్జున వెల్లడించారు. కాగా, గోమతి రెడ్డి, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా ప్రధాన పాత్రల్లో ఉదయ్ చౌహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పళ్ళ బురుసు’ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.