సినిమా ఇమేజ్ మాత్రమే కాదు.. ప్రజల్లో మార్పు కోరికే విజయ్‌ని సీఎంను చేసింది: విశాల్
- విజయ్ సీఎం కావడంపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
- సీఎం అయినా మనిషిగా విజయ్ లో ఏమాత్రం మార్పు రాలేదన్న విశాల్
- ప్రజలతో ఏర్పరచుకున్న కనెక్టివిటీ ఆయనను ఈ స్థాయికి చేర్చిందని వ్యాఖ్య
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ విజయం సాధించడంపై నటుడు విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో శివాజీ గణేశన్, కే భాగ్యరాజ్, అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి వంటి దిగ్గజాలు రాజకీయంలో విఫలమైనప్పటికీ, విజయ్ మాత్రం రాణించడానికి ఆయన పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం, బలమైన మార్పు కోరికే కారణమని విశాల్ అభిప్రాయపడ్డారు. ఇటీవల సీఎం విజయ్‌ని కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయన హోదా మాత్రమే మారిందని, మనిషిగా ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదని తెలిపారు.
ఎన్నికల ప్రచార ముగింపు రోజున “మీ తల్లిదండ్రులకు, ఇళ్లలోని పెద్దలకు చెప్పి ఒక్కసారి నాకు ఓటు వేయమని కోరండి” అని విజయ్ చేసిన పిలుపు ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపిందని విశాల్ పేర్కొన్నారు. నటుడిగానే కాకుండా ప్రజలతో ఏర్పరచుకున్న కనెక్టివిటీ ఆయనను ఈ స్థాయికి చేర్చిందన్నారు. ఇక విశాల్ తొలిసారిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘మగుడం’ (తెలుగులో ‘మకుటం’) చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.