వైసీపీ రౌడీ మూకలు రాజకీయ హత్యలకు పాల్పడుతున్నాయి: ఏపీ మంత్రి టీజీ భరత్
- కర్నూలులో కలకలం రేకెత్తించిన ఇంతియాజ్ హత్య
- జిల్లాలో వైసీపీ రౌడీ మూకలు హత్యాయత్నాలు చేస్తున్నాయన్న భరత్
- వైసీపీ నేతలు చేసిన అక్రమ భూకబ్జాలను ఇంతియాజ్ బయటపెట్టారని వెల్లడి
కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేకెత్తించింది. ఈ సందర్భంగా రాష్ట్ర వైసీపీ నాయకులు రాజకీయ హత్యలు, అరాచకాలకు పాల్పడుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... జిల్లాలో వైసీపీ రౌడీ మూకలు హత్యలు, హత్యాయత్నాలతో భయాందోళనలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. పక్కా పథకం ప్రకారమే టీడీపీ కార్యకర్త ఇంతియాజ్‌ను దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు ఇంతియాజ్ నామినేషన్ వేసినప్పుడు వైసీపీ వర్గీయులు బెదిరింపులకు దిగారని, ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారని మంత్రి వెల్లడించారు. హంద్రీ నదిలో వైసీపీ నేతలు చేసిన అక్రమ భూకబ్జాలను ఇంతియాజ్ ధైర్యంగా బయటపెట్టారని, ఆ కక్షను మనసులో ఉంచుకునే దారుణంగా పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రతీకారంతో హత్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.