లండన్ లో మంత్రి నారాయణ బృందం.. ఐకానిక్ భవనాల తుది డిజైన్లపై కీలక చర్చలు
- అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వెలుపలి డిజైన్లపై చర్చించనున్న బృందం
- నార్మన్ అండ్ ఫోస్టర్స్, హఫీజ్ కాంట్రాక్టర్స్, బ్యూరో హాపోల్డ్ కన్సల్టెన్సీ, ఎల్ అండ్ టీ తో చర్చ
- అసెంబ్లీ భవనం పైభాగంలో నిర్మించే ఎత్తైన టవర్ డిజైన్‌పై ప్రధానంగా చర్చ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించనున్న ఐకానిక్ భవనాల తుది డిజైన్లపై స్పష్టతనిచ్చేందుకు ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం లండన్‌లో పర్యటిస్తోంది. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం (సెక్రటేరియట్) టవర్ల వెలుపలి డిజైన్ల ముసాయిదాను ఖరారు చేయడంపై ఆర్కిటెక్ట్‌లు, ప్రముఖ కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి నారాయణ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఐకానిక్ భవనాల డిజైన్లు రూపొందించిన నార్మన్ అండ్ ఫోస్టర్స్, హఫీజ్ కాంట్రాక్టర్స్, బ్యూరో హాపోల్డ్ కన్సల్టెన్సీ, ఎల్ అండ్ టీ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ భవనం పైభాగంలో నిర్మించే ఎత్తైన టవర్ డిజైన్‌పై ప్రధానంగా చర్చ జరగనుంది. అమరావతి నగరాన్ని వీక్షించేలా దీనిని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మంత్రి నారాయణతో పాటు సీఆర్డీయే కమిషనర్ విజయరామరాజు, అడిషనల్ కమిషనర్ అభిషేక్ కుమార్, చీఫ్ ఇంజినీర్లు ఈ లండన్ పర్యటనలో పాల్గొన్నారు.