ఒకే వేదికపై టీడీపీ, వైసీపీ నేతలు.. చర్చనీయాంశమైన మంత్రి తీరు

TDP and YSRCP leaders on one stage Minister behavior becomes a topic of discussion
  • వైసీపీ నేతలతో వేదిక పంచుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్
  • కాకినాడ జిల్లాలో శెట్టిబలిజ ఆరాధ్య దైవం విగ్రహావిష్కరణ
  • వైసీపీ నేత పాలిక శ్రీను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘటన
  • మంత్రి తీరుపై టీడీపీ అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం
  • రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఉదంతం
కాకినాడ జిల్లాలో ఆదివారం ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, టీడీపీ నేత వాసంశెట్టి సుభాష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఒకే వేదికను పంచుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చీడిగ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

శెట్టిబలిజ సామాజిక వర్గానికి ఆరాధ్యుడైన దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని చీడిగలో ప్రతిష్ఠించారు. రాజమండ్రి వైసీపీ నేత పాలిక శ్రీను ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ పితాని అప్పన్న, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు విగ్రహావిష్కరణ చేపట్టారు. ఈ వేడుకకు మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ టీడీపీ ఇన్‌ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్యనారాయణమూర్తి, డీసీఎంఎస్ ఛైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, అమలాపురం మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబు సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. అయితే, కార్యక్రమ నిర్వాహకుడైన వైసీపీ నేత పాలిక శ్రీనుతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులతో మంత్రి సుభాష్ ఒకే వేదిక పంచుకోవడం చర్చకు దారితీసింది.

రాజకీయ బద్ధశత్రువులుగా భావించే ఇరు పార్టీల నేతలు ఒకే వేదికపై కనిపించడాన్ని టీడీపీలోని కొందరు నేతలు తప్పుపడుతూ, పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఉదంతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.                                
Advertisement
Vasamsetti Subhash
TDP YSRCP leaders same stage
Palika Srinu
Kakinada politics
Dommeti Venkata Reddy statue
Andhra Pradesh political news

More Telugu News