ఓల్డ్ మాంక్.. భారత ఫేవరెట్ రమ్ బ్రాండ్ కు గడ్డుకాలం!

Old Monk Indias favorite rum brand faces tough times
  • భారత్ ఐకానిక్ రమ్ ఓల్డ్ మాంక్‌కు షాక్
  • అనుమతి లేని ఫ్లేవర్లు వాడారని ఆరోపణలు
  • వయసు విషయంలో తప్పుదారి పట్టిస్తున్నారని గుర్తింపు
  • కొన్ని వేరియంట్ల అమ్మకాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధం
  • మెక్‌డొవెల్స్, రాయల్ ఛాలెంజ్ బ్రాండ్లపైనా చర్యలు
భారతదేశంలో దశాబ్దాలుగా అత్యంత ప్రజాదరణ పొందిన డార్క్ రమ్ బ్రాండ్ 'ఓల్డ్ మాంక్' తీవ్ర వివాదంలో చిక్కుకుంది. నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘన, లేబుళ్లపై తప్పుదారి పట్టించే సమాచారం వంటి కారణాలతో ఈ బ్రాండ్‌కు చెందిన కొన్ని వేరియంట్ల అమ్మకాలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిషేధించింది. ఈ వార్త ఓల్డ్ మంక్ అభిమానులకు, మద్యం రంగ నిపుణులకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.

మహారాష్ట్రలోని ఒక డిస్టిలరీలో తయారైన ఓల్డ్ మాంక్ మూడు వేరియంట్లలో అనుమతి లేని కృత్రిమ ఫ్లేవర్లను గుర్తించినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తన నివేదికలో పేర్కొంది. సహజసిద్ధమైన రుచి, వాసనను అనుకరించేలా వీటిని వాడటం వినియోగదారులను మోసం చేయడమేనని స్పష్టం చేసింది. ఓల్డ్ మంక్‌తో పాటు మెక్‌డొవెల్స్, రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ బ్లూ విస్కీలకు చెందిన కొన్ని బ్యాచ్‌లపై కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ చర్యలు తీసుకుంది.

దీంతో పాటు, ఓల్డ్ మాంక్ బాటిళ్లపై ఉన్న "7 ఇయర్స్ ఓల్డ్ బ్లెండెడ్" అనే వాదన కూడా తప్పుదారి పట్టించేలా ఉందని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. 2018 ఆహార భద్రత, ప్రమాణాల (ఆల్కహాలిక్ బెవరేజెస్) నిబంధనల ప్రకారం, ఏదైనా మద్యం మిశ్రమంలో అతి తక్కువ వయసు ఉన్న స్పిరిట్ వయసునే లేబుల్‌పై ప్రకటించాలి. అయితే, ఓల్డ్ మాంక్ రమ్‌లో ఎక్కువ భాగం వయసు నిర్ధారణ లేని సాధారణ స్పిరిట్‌తో తయారుచేసి, కేవలం 5 శాతం కన్నా తక్కువ మాత్రమే ఏళ్ల తరబడి నిల్వ ఉంచిన రమ్‌ను కలుపుతున్నారని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆక్షేపించింది.

ఓల్డ్ మాంక్.. కేవలం బ్రాండ్ కాదు, ఒక జ్ఞాపకం

ఓల్డ్ మాంక్ చరిత్ర 1855లో హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలిలో మొదలైంది. బ్రిటిష్ సైనికుల కోసం బీర్ తయారు చేయడానికి ఎడ్వర్డ్ అబ్రహం డయ్యర్ (1919 జలియన్‌వాలా బాగ్ దురంతానికి కారణమైన కల్నల్ డయ్యర్ తండ్రి) ఒక బ్రూవరీని ప్రారంభించారు. కాలక్రమేణా ఇది చేతులు మారి మోహన్ మీకిన్ బ్రూవరీస్‌గా మారింది. 1954లో నరేంద్ర నాథ్ మోహన్ కుమారుడు వేద్ రతన్ మోహన్ 'ఓల్డ్ మాంక్' రమ్‌ను మార్కెట్లోకి తెచ్చారు.

ఎటువంటి భారీ ప్రకటనలు లేకుండా, కేవలం దాని రుచి, వాసన, విలక్షణమైన బాటిల్ డిజైన్‌తోనే ఈ బ్రాండ్ భారతీయ సంస్కృతిలో ఒక భాగమైపోయింది. ఇటీవలి కాలంలో విస్కీ, ఇతర రమ్‌ల నుంచి పోటీ పెరిగినప్పటికీ, కాఫీ, స్పైస్డ్ ఎక్స్‌ఓ వంటి కొత్త ఫ్లేవర్లతో తిరిగి పుంజుకుంది. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 2,166 కోట్ల అమ్మకాలు, రూ. 103 కోట్ల లాభం సాధించింది. ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ తీసుకున్న చర్యలు ఈ ఐకానిక్ బ్రాండ్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి.


Advertisement
Old Monk
FSSAI
Mohan Meakin
Indian Dark Rum
Liquor Quality Standards
Alcohol Ban India

More Telugu News