హెడ్‌సెట్ పెట్టుకుంటే ‘దొంగ’ అనే నినాదాలు వినిపించవు: మమతకు సువేందు చురక

Wear headsets to avoid hearing thief slogans Suvendu Adhikari mocks Mamata
  • తన కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తలే దాడి చేశారని మమత ఆరోపణ
  • ఆ నిరసనల్లో బీజేపీ జెండాలు, కార్యకర్తలు ఎవరూ లేరన్న సీఎం సువేందు
  • ఇది ప్రజా ఆగ్రహం వల్లే జరిగిందని, తమ ప్రమేయం లేదని స్పష్టీకరణ
  • టీఎంసీ కార్యకర్త మృతిపై పరామర్శకు వెళ్లిన మమతకు ఎదురైన నిరసన సెగ
మమతా బెనర్జీ ప్రజల్లోకి వెళ్లేటప్పుడు హెడ్‌సెట్ పెట్టుకుంటే మంచిదని, అప్పుడు ‘దొంగ’ అంటూ జనం చేసే నినాదాలు వినపడవని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సూచించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బిజ్‌పూర్‌లో మమత పర్యటన సందర్భంగా ఆమె కాన్వాయ్‌పై దాడి జరగడం, నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పోలీసు కస్టడీలో మరణించిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త బిర్జు కియోట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మమత  ఆదివారం బిజ్‌పూర్‌కు వెళ్లారు. ఈ సమయంలో ఆమె తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. కొందరు నిరసనకారులు మమత కాన్వాయ్‌పైకి బూట్లు, బురద, రాళ్లతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ దాడి వెనుక బీజేపీ గూండాలు ఉన్నారని మమత ఆరోపించారు. కారు అద్దాలు తెరిచి ఉంటే తనకు ప్రాణహాని జరిగి ఉండేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

మమత ఆరోపణలను సీఎం సువేందు అధికారి పూర్తిగా ఖండించారు. ఇది పూర్తిగా ప్రజా ఆగ్రహం వల్ల జరిగిన ఘటన అని, ఇందులో భారతీయ జనతా పార్టీ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. టీవీ ఫుటేజీలో తనకు బీజేపీ జెండాలు గానీ, తెలిసిన కార్యకర్తల ముఖాలు గానీ కనిపించలేదని ఆయన అన్నారు. మమతకు ఇంకా జడ్-ప్లస్ కేటగిరీ భద్రత కొనసాగుతోందని, ఈ ఘటన సమయంలో కూడా పోలీసులు ఆమెకు పూర్తి భద్రత కల్పించారని గుర్తుచేశారు.

మరోవైపు, మృతుడు బిర్జు కియోట్ కుటుంబ సభ్యులు కూడా మమత రాకను వ్యతిరేకించినట్లు సువేందు తెలిపారు. తమకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉందని, అతడి మృతిపై న్యాయం జరగాలని కోరుతున్నారని, మమతను తాము పిలవలేదని కుటుంబ సభ్యులు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు భారీగా దోచుకున్నారని, అందుకే ‘దొంగ’ అనే నినాదాలు వినాల్సి వస్తోందని సువేందు వ్యాఖ్యానించారు.
Advertisement
Mamata Banerjee
Suvendu Adhikari
Bijpur West Bengal
Mamata Banerjee Convoy Attack
Trinamool Congress
BJP vs TMC

More Telugu News