పార్టీ మారకుండా ఉంటే ఈపాటికి తండ్రీకొడుకులను లోపల వేసేవాళ్లం: బాలినేని ఆరోపణలకు దామచర్ల కౌంటర్

Damacharla Janardhan counters Balineni says would have jailed father and son if they hadnt changed party
  • ఒంగోలులో దామచర్ల వర్సెస్ బాలినేని
  • దామచర్లపై తీవ్ర ఆరోపణలు చేసిన బాలినేని
  • గత ప్రభుత్వంలో చేసినట్టు రౌడీయిజం చేస్తామంటే ఇక కుదరదని దామచర్ల హెచ్చరిక
  • అక్రమాలపై కాణిపాకంలో ప్రమాణం చేయాలని బాలినేనికి సవాల్
  • బార్ షాపుల సిండికేట్‌తో తండ్రీకొడుకులు కోట్లు దండుకున్నారని ఆరోపణ
  • ప్రభుత్వ భూమిలోని విల్లాలను పేదలకు పంచుతామని ప్రకటన
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తనపై బాలినేని చేసిన విమర్శలకు దామచర్ల తీవ్రస్థాయిలో బదులిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో చేసినట్టు రౌడీయిజం చేస్తామంటే ఇప్పుడు కుదరదని హెచ్చరించారు. చేసిన ఆరోపణలపై అక్రమాలపై కాణిపాకంలో ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు.

ఆదివారం ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దామచర్ల మాట్లాడుతూ.. బాలినేని కూటమిలో ఉన్నారనే తాము ఇన్నాళ్లు మౌనంగా ఉన్నామని, కానీ ఆయన అమావాస్యకోసారి ఒంగోలు వచ్చి విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తనపై కరపత్రాలు పంపిణీ చేసింది బాలినేని అనుచరుడు మురళీయేనని, ఈ విషయం పోలీసుల విచారణలో కూడా తేలిందని స్పష్టం చేశారు. అదే తాము బాలినేనిపై కరపత్రాలు వేయాలనుకుంటే పుస్తకాలే సరిపోవని అన్నారు.

గత ప్రభుత్వంలో తమపై 79 కేసులు పెట్టారని గుర్తుచేశారు. ఆనాడు బాలినేని పార్టీ మారకుండా ఉండుంటే ఈపాటికి తండ్రీకొడుకులిద్దరినీ లోపల వేసేవారని దామచర్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు జనసేన ముసుగులో ఉంటూ వైసీపీ నేతల కోసం పనిచేస్తున్నారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. బార్ షాపుల సిండికేట్ ద్వారా తండ్రీకొడుకులు కోట్లు దండుకున్నారని, ఈ విషయంపై బాలినేని ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజలకు తన వ్యక్తిత్వం ఏంటో తెలుసు కాబట్టే గత ఎన్నికల్లో 34,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారని, బాలినేని తలకిందులుగా తపస్సు చేసినా అంత మెజారిటీ రాదని దామచర్ల అన్నారు. ప్రభుత్వ భూమిలో బాలినేని బంధువు కట్టిన విల్లాలను స్వాధీనం చేసుకొని, ఆ స్థలాన్ని వెంగముక్కలపాలెం ప్రజలకు కమ్యూనిటీ హాల్ కోసం కేటాయిస్తామని ఆయన ప్రకటించారు.
Advertisement
Damacharla Janardhan
Balineni Srinivasa Reddy
Ongole MLA
Andhra Pradesh Politics
Janasena Party
YSRCP

More Telugu News