మహేశ్‌బాబు బర్త్‌డే గిఫ్ట్: 'వారాణాసి' నుంచి 'రుద్ర'గా ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల!

Mahesh Babu Birthday Gift First Look Glimpse of Rudra from Varanasi Released
  • సినిమాలో 'రుద్ర' అనే పవర్‌ఫుల్ పాత్రలో మహేశ్
  • రుద్ర పాత్రకు మహేశ్ ప్రాణం పోశారంటూ రాజమౌళి ప్రశంసలు
  • ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి.. గ్రహశకలం నేపథ్యంతో కథ
  • మహేశ్‌కు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రత్యేక శుభాకాంక్షలు
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చాడు. ఆయన కథానాయకుడిగా ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ చిత్రంలో మహేశ్ 'రుద్ర' అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నాడు.

విడుదల చేసిన పోస్టర్లలో మహేశ్‌బాబు సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఒక పోస్టర్‌లో వెదురు తెప్పపై సేద తీరుతూ కనిపించగా, మరో పోస్టర్‌లో ఆఫ్రికా అడవుల్లోని ప్రకృతిని చూస్తూ నిలబడి ఉన్నాడు. "తీవ్రత మాత్రమే అతని నైజం కాదు... 'వారణాసి'లో రుద్ర" అంటూ మహేశ్‌బాబు ఈ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, మహేశ్ పాత్ర గురించి, నటన గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. "రుద్ర ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం పుట్టాడు. తను కోరుకోని విధిని మోస్తున్నాడు. అతడు చమత్కారి, సున్నితమైనవాడు, అదే సమయంలో తీవ్రమైన వాడు. మహేశ్ ఈ పాత్రకు ప్రాణం పోశాడు. తీవ్రత, సున్నితత్వం రెండింటినీ ఒకేసారి పండించగల నటులు చాలా తక్కువ మందే ఉంటారు" అని రాజమౌళి ప్రశంసించాడు. ఆఫ్రికాలోని కిలిమంజారో, మసాయ్ మారా ప్రాంతాల్లో షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ, అక్కడి లొకేషన్లు సెట్స్‌లో సృష్టించలేని అనుభూతిని ఇచ్చాయని తెలిపాడు.

ఈ చిత్రంలో మహేశ్‌తో పాటు నటిస్తున్న ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'వారణాసి' సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. ప్రధాన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయిందని, మిగిలిన భాగాన్ని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారని సమాచారం.

వారణాసి నగరం మీదకు ఒక గ్రహశకలం దూసుకొస్తున్న నేపథ్యంలో రుద్ర అనే పాత్రధారి ఏం చేశాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. వి. విజయేంద్ర ప్రసాద్, ఎస్.ఎస్. కంచి కథను అందించగా, శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ పతాకాలపై కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Advertisement
Mahesh Babu
SS Rajamouli
Varanasi Movie
Rudra First Look
Priyanka Chopra
Mahesh Babu Birthday

More Telugu News